2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. రెండేళ్ల విరామానికి తెరదించుతూ తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ.. రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గానే ఉంటున్నాడు. రెంటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఐతే రాజకీయాలకు ఇంకా ఎక్కువ సమయం కేటాయించి, పార్టీ నిర్మాణంపై ఎక్కువ దృష్టిసారించడం, అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడం, జనాల్లో ఎక్కువ సమయం గడపడం అవసరమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంలో పవన్‌కు ఫీడ్ బ్యాక్ అందకపోతూ ఉండదు. ఈ నేపథ్యంలోనూ పవన్ ఒక వినూత్న ఆలోచనతో జనాల ముందుకు వచ్చాడు. అధికార పార్టీ తన మీద చేసే ముఖ్యమైన విమర్శల విషయంలో వీడియో బైట్‌లు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నాడు. ఈమేరకు జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తాజాగా రెండు వీడియోలు పోస్ట్ అయ్యాయి.
జనసేనానిని తెలుగుదేశం పార్టీ దత్తపుత్రుడు అని తరచుగా వైకాపా నేతలు విమర్శలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణపై ఒక వీడియోలో పవన్ బదులిచ్చాడు. తెలుగుదేశం పేరెత్తకుండా తాను ఏదో పార్టీకి దత్తపుత్రుడిని కాదని.. ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడినని పవన్ స్పష్టం చేశాడు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబట్టిన పవన్.. వాళ్లకు కడుపు మండి లక్షల మంది బయటికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే దాని వెనుక జనసేనో, తెలుగుదేశమో లేదంటే భాజపానో ఉన్నట్లు విమర్శలు చేయడం సరికాదని పవన్ వ్యాఖ్యానించాడు. ఇక ఉద్యోగులపై ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందన్న తన విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల అభ్యంతరం వ్యక్తం చేయడంపైనా పవన్ మరో వీడియోలో స్పందించాడు.
సమ్మెకు దిగుతామని హెచ్చరించిన ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తామని బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని, దీన్ని వక్రీకరించొద్దని పవన్ సజ్జలకు విజ్ఞప్తి చేశాడు. ఐతే ఇలా వివరణలతో వీడియోలు రిలీజ్ చేయడం బాగానే ఉంది కానీ.. అందులో పవన్ స్వరం మరీ మెతకగా ఉంది. ఏదో విన్నపాలు చేస్తున్నట్లు, వివరణ ఇస్తున్నట్లు కాకుండా కొంచెం దూకుడుగా, కార్యకర్తలకు జోష్ వచ్చేలా, ప్రత్యర్థి పార్టీ జడుసుకునేలా ఆయన మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు, అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.