“ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభల్లో 28 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటికి 32 నెలలు గడిచాయి. ఏపీకి మీరు ఏం చేశారు? ఏం తెచ్చారు? కేంద్రాన్ని ఏ విషయంలో నిలదీశారు? ఏ విషయంలో మెడలు వంచారు? చెప్పండి!“ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కారు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై కేంద్రం దృష్టి పెట్టాలని అన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన అంటే అప్పులు చెయ్యడం, దోచుకోవడం అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్ర భవిష్యత్ అత్యంత ప్రమాదంలోపడిపోయిందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరవాత అన్ని ప్రభుత్వాలు చేసిన అప్పుల కంటే.. కేవలం 32 నెలల్లో ఈ ప్రభుత్వం చేసిన అప్పు ఎక్కువగా ఉందన్నారు. 2019 లో వైసీపీ అధకారంలోకి రాకముందు అన్ని ప్రభుత్వాలు కలిపి 3.14 లక్షల కోట్ల అప్పులు చెయ్యగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 3.64 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఎటువంటి అభివృద్ది లేకుండా, నింబంధనలకు విరుద్ధంగా చేస్తున్న ఈ అప్పులతో తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.
మరోవైపు ఇసుక, మద్యం, మైనింగ్ లలో జరగుతున్న అధికారిక దోపిడీ రాష్ట్ర అభివృద్దికి విఘాతంగా మారిందని చంద్రబాబు ఫైరయ్యారు. ఈ అక్రమాలపై, రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై.. కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల అప్పులకు ఇచ్చే గ్యారెంటీ లను 90 శాతం నుంచి 180 శాతం పెంచుతూ FRBM యాక్ట్ కు చేసిన చట్ట సవరణను చంద్రబాబు తప్పు పట్టారు. చట్ట సవరణ ద్వారా ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా రాబోయే రోజుల్లో దాదాపు రూ.80 వేల కోట్ల వరకు అదనపు అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పులు తెచ్చుకునేందుకు చట్టాలను మార్చిన చరిత్ర లేదని దుయ్యబట్టారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టేలా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు లేవనెత్తాలని నిర్ణయించారు. దక్షిణ భారత దేశంలో తలసరి ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. రాష్ట్రం తిరగమనంలో ఉంది అనడానికి ఇదోక ఉదాహరణగా ఉందన్నారు. ఏపీ కార్పొరేషన్ల ద్వారా తెచ్చే అప్పులు ఆయా కార్పొరేషన్లకు ఖర్చు పెట్టకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తూ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని అన్నారు. కోవిడ్తో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని.. సుప్రీం కోర్టు, కేంద్రం చెప్పిన తరువాత కూడా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని.. ఈ అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని అన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో క్యాసినో నిర్వహించి తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలపై దెబ్బకొట్టిన అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించారు. చట్ట పరిరక్షణలో రాష్ట్ర పోలీసు శాఖ విఫలం అవుతున్న తీరుతో పాటు.. అక్రమ కేసుల వంటి చర్యలపైనా పార్లమెంట్ లో ప్రస్తావించాలని అన్నారు. క్యాసినో విషయంలో ED, DRI, NCB లతో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.
“వైసీపీకి పార్లమెంట్ లో 28 మంది ఎంపీల బలం ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం సాధించింది మాత్రం శూన్యం“ అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకు రాలేదని అన్నారు. సీఎం జగన్ డిల్లీ వెళ్లి జరపుతున్న చర్యల సారాంశం కూడా చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సీఎం డిల్లీ పర్యటనలతో ఏం సాధించారు అనేది చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులుతో పాటు విభజన హామీలను వైసిపి ఎంపిలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అమలు కాని పరిస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఈ అంశాలు బహిర్గతం చెయ్యాలని ఎంపీలకు సూచించారు.
This post was last modified on January 28, 2022 7:12 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…