దళిత బంధు- లబ్ధిదారులైన దళితులకు రూ.10 లక్షల చొప్పున ఇచ్చే కీలకమైన పథకం. దీనిని ఎప్పుడు అమలు చేస్తారు? ఎలా అమలు చేస్తారు? అనే సందేహాలు.. అనుమానాలు.. అన్ని వర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయా సందేహాలకు, అనుమానాలకు చెక్ పెడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే హుజూరాబాద్‌లో ఇది అమలవుతోంది. దీంతో మిగిలిన.. 118 నియోజకవర్గా్లలో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం రెడీ అయింది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఈ పథకాన్ని అమలు చేస్తారు.
రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దళితబంధు పథకం అమలుపై కరీంనగర్ నుంచి ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కుటుంబాన్ని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. మార్చి నెలలోపు 100 కుటుంబాలకు దళితబంధు పంపిణీ చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి దతత్తగ్రామం వాసాలమర్రి, హజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్ పద్ధతిన పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. మరో నాలుగు మండలాల్లోనూ పైలట్ పద్ధతిన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాలు ఇందులో ఉన్నాయి. హుజూరాబాద్లో పూర్తి స్థాయిలో దళితబంధు అమలవుతున్న తరుణంలో రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వంద మంది లబ్దిదారుల చొప్పున పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు.
ఆ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. దళితబంధు అమలుకు సంబంధించి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 118 శాసనసభ నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రతి నియోజకవర్గంలో కుటుంబం యూనిట్గా వందమంది లబ్దిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. మార్చి నెలలోగా ఆయా నియోజకవర్గాల్లో వంద కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని చెప్పారు. ఇందుకోసం స్థానిక శాసనసభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంఛార్జి మంత్రులతో ఆమోదించుకోవాలని తెలిపారు.
ప్రతి లబ్ధిదారుడికి బ్యాంకు లింకేజి లేకుండా పది లక్షల రూపాయల ఆర్థికసాయంతో కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో లబ్దిదారుడికి మంజూరైన పది లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 118 నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1200 కోట్ల రూపాయలు కేటాయించి అందులో ఇప్పటికే వంద కోట్లు విడుదల చేశారు. మిగతా మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates