జనసేనలో సీఎం ఆశలు!

రాబోయే ఎన్నికల మీద జనసేన పెద్ద ఆశలే పెట్టుకున్నట్లుంది. రాబోయే ఎన్నికల్లో తమ అధినేత పవన్ కళ్యాణే సీఎం అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బల్లగుద్దకుండానే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం ఎలా అవుతారో చెప్పమంటే అవుతారంతే అని భుజాలు  ఎగరేస్తున్నారు. పవన్ సీఎం అయ్యేందుకు దోహద పడే కారణాలను చెప్పమంటే మాత్రం నోరిప్పటంలేదు.

బహశా కర్నాటకలో జేడీ (ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి  ముఖ్యమంత్రయిన పద్దతిలోనే తమ అధినేత కూడా సీఎం కాకపోతారా అనే ఆశలు పెరిగిపోతున్నట్లున్నాయి. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ కు అధ్యధిక సీట్లు వచ్చాయి. వీటి తర్వాత జేడీఎస్ కు 35 సీట్లొచ్చాయి. అయితే బీజేపీని అధికారంలోకి రానీయకూడదన్న ఏకైక కారణంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు మద్దతిచ్చింది. దాంతో కుమారస్వామి ఏకంగా సీఎం అయిపోయారు.

మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. కానీ కుమారస్వామిని అదృష్టం దరిద్రం పట్టుకున్నట్లు పట్టుకోవటంతో 35 మంది ఎంఎల్ఏలతోనే సీఎం అయిపోయారు. ఏపీలో కూడా రాబోయే ఎన్నికల్లో అలాంటి పరిస్ధితి రాకుండా ఉంటుందా అప్పుడు పవన్ సీఎం అవ్వకపోతారా అని అనుకుంటున్నట్లున్నారు. ఇపుడు క్షేత్రస్థాయిలో ఉన్న లాజిక్ ప్రకారమైతే పవన్ తల్లకిందులుగా తపస్సుచేసినా సీఎం అయ్యే అవకాశమే లేదు.

మిత్రపక్షాల్లో బీజేపీకి ఉన్న బలమేంటో అందరికీ తెలుసు. అలాగే పవన్ కు పోయిన ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచారో కూడా అందరికీ గుర్తుంది. ఇలాంటి పరిస్ధితుల్లో పవన్ సీఎం అంటే కచ్చితంగా టీడీపీని కలుపుకుని వెళ్ళాల్సిందే. మరి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రిగా తాను కాకుండా మరొకరికి చంద్రబాబు ఎందుకు అవకాశం ఇస్తారు ? కాబట్టి లాజిక్ ప్రకారమైతే 2023లో పవన్ సీఎం అయ్యే అవకాశం ఎక్కడా కనబడటం లేదు. మరి జనసేనాని అదృష్టం ఎలా ఉందో మనం చెప్పలేం.