పంజాబ్‌లో కాంగ్రెస్ మ‌ళ్లీ పాగా వేస్తుందా?

ఇదీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్న ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒక్క‌టే ఆ పార్టీకి ఆశాజ‌న‌కం గా మారింది. ఇక్క‌డైనా గెలుపు గుర్రం ఎక్కి.. రెండో ద‌ఫా అధికారం ద‌క్కించుకుంటే త‌ప్ప‌.. కాంగ్రెస్‌కు ప‌రువు, మ‌ర్యాద‌లు ద‌క్కేలా లేవ‌ని అంటున్నారు పరిశీల‌కులు. అయితే.. 2017లో ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొన్ని రోజులు స‌జావుగానే సాగినా.. త‌ర్వాత త‌ర్వాత‌.. సొంత నేత‌ల ప్ర‌త్యేక వివాదాల‌తో పార్టీ అధిష్టానానికి బొప్పి క‌ట్టింది. పైగా ఇటీవ‌ల కెప్టెన్‌.. అప్ప‌టి వ‌ర‌కు సీఎంగా ఉన్న అమ‌రీంద‌ర్ సింగ్ ఆక‌స్మిక రాజీనామా.. ఆయ‌న బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. సొంత కుంప‌టి పెట్టుకోవ‌డం.. వంటివి పార్టీని ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి.

ఇదిలావుంటే.. సొంత పార్టీలోనూ.. సిద్దూ చే్స్తున్న రాజ‌కీయాలు.. పార్టీలో లుక‌లుక‌ల‌ను మ‌రింత పెంచుతున్నాయి. పార్టీ చీఫ్‌గా ఉండి.. త‌న మాటే నెగ్గాల‌నే వ్యూహంతో ఆయ‌న వేసిన అడుగులు.. పార్టీలో చీలిక‌ల‌ను పెంచి పోషించాయ‌నే చెప్పాయి. పైగా.. ఇటీవ‌ల సీఎం కుర్చీకోసం.. సిద్దూ చేసిన యాగీ.. అధిష్టానానికి మ‌రింత విసుగు తెప్పించింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు కాదు! అని అధిష్టానం తేల్చి చెప్పింది. అయితే.. ఇప్పుడు అదే అంశం పార్టీకి శ‌రాఘాతంగా మార‌నుంది. సీఎం సీటు కోసం కుస్తీ ప‌డుతున్న సిద్దూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో(ఇప్ప‌టికే షెడ్యూల్ ప్ర‌క‌టించారు) ‘త‌న‌కు సీఎం సీటు ఇస్తానంటేనే..’ అని ష‌ర‌తులు పెట్టేందుకు రెడీ అయ్యారు.

అయితే.. సిద్దూకు సీఎం సీటు ప్ర‌క‌టిస్తే.. ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. ప్ర‌స్తుత సీఎం చ‌న్నూ వ‌ర్గం స‌హా.. మ‌రికొన్ని వ‌ర్గాలు పార్టీకి దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇదే ఇప్పుడు బీజేపీకి కావాల్సింది. పార్టీ ఎంత బ‌ల‌హీన‌మైతే.. అంత త‌మ‌కు మంచిద‌నే వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఇది నేరుగా బీజేపీకి ల‌బ్ధి చేకూర్చ‌క పోయినా.. మాజీ సీఎం అమ‌రీంద‌ర్ పెట్టుకున్న పార్టీవైపు వీరు మొగ్గు చూపి.. కాంగ్రెస్ ఖాళీ కావ‌డ‌మే బీజేపీ వేసుకుంటున్న ప్లాన్‌. దీంతో సీఎం సీటు విష‌యంలో సిద్ధూకు హామీ ఇవ్వ‌క‌పోతే.. ఒక తంటా.. ఇస్తే.. ఒక తంటా అన్న విధంగా కాంగ్రెస్ ప‌రిస్థితి మారిపోయింది.

ఇదిలావుంటే.. మ‌రోవైపు మూడు సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించిన రైతు సంఘాలు రాజ‌కీయ పార్టీ పెట్ట‌నున్నాయి. అయితే.. ఇప్ప‌టికిప్పుడు.. వీరు పార్టీ పెట్టినా.. పెట్ట‌క‌పోయినా… ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు కావ‌డం.. దీనిని కాంగ్రెస్ ఉద్దేశ పూర్వ‌కంగానే భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌కపోవ‌డం వంటి అంశాల‌పై బీజేపీ బాగా ఫోక‌స్ చేసింది. దేశ‌ప్ర‌ధానికే భ‌ద్ర‌త క‌ల్పించ‌లేని.. కాంగ్రెస్‌.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం భ‌ద్ర‌త క‌ల్పిస్తుంద‌ని బీజేపీ నాయ‌కులు ఇప్ప‌టికే ప్ర‌చారం అందుకున్నారు. ఇలా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అన్ని వైపుల నుంచి అనేక స‌వాళ్లు ఏర్ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో తిరిగి అధికారం చేప‌డుతుందా? లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.