రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రరాజధాని ప్రాంతం అమరావతిలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం పర్యటించనున్న ఆయనపై ఇక్కడి రైతులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో 700 రోజులకు పైగా రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న రైతులు.. జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికేం దుకు రెడీ అయ్యారు. వాస్తవానికి విజయవాడకుచేరుకున్న సమయంలోనే(శుక్రవారం) జస్టిస్‌ను కలిసేందుకు రాజధాని మహిళా రైతులు.. ప్రయత్నించారు.
అయితే.. పోలీసులు వారిని అడ్డుకుని పంపించేశారు. ఈ క్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ స్వయంగా అమరావతికి వస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఒకవైపు ఆనందం.. మరోవైపు.. ఆయన స్పందిస్తారో.. లేదో నన్న ఉత్కంఠ నెలకొంది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న కేసులపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం లోని ధర్మాసనం.. కొన్ని రోజుల కిందట తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి ట్రేడింగ్ జరగలేదని ఆయన తీర్పు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతులు ఆయనపై ఎనలేని ఆశలతో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది వ్యక్తిగత పర్యటన అయిన నేపథ్యంలో ఆయన రాజధాని గురించి ఏదైనా ప్రకటన చేయబోతారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు రైతు జేఏసీ నేతలు.. జస్టిస్ రమణను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు అప్పాయింట్‌మెంట్ కోరారు. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, రైతుల ఆశలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. ఇదిలావుంటే.. మందడం దీక్షా శిబిరంలో అమరావతి రైతు మహిళలు వేకువజామునుంచి పూల రెమ్మెలు ఒలుస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న తమకు న్యాయస్థానమే అండగా నిలిచిందని అందుకే కోర్టును దేవాలయంగా భావించి న్యాయమూర్తులను దేవతామూర్తులుగా పూజలు చేస్తున్నామని రైతులు తెలిపారు.
మరోవైపు.. వైసీపీ నేతలు మాత్రం సీజేఐ జస్టిస్ రమణ ఏం మాట్లాడతారో.. ఏమో.. అనే విషయంపై దడద డ లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని రైతులు వచ్చి ఏం చెబుతారా? జస్టిస్ రమణ ఎలా రియాక్ట్ అవుతారా? అనేది నేతల మధ్య ఉత్కంఠ చర్చగా మారింది. మొత్తానికి ఏపీ పర్యటనలోఉన్న సీజేఐ జస్టిస్ రమణ.. తొలిసారి అమరావతిలో పర్యటిస్తుండడం.. అందరికీ ఆసక్తిగా మారింది. మరి ఏం మాట్లాడతారో చూడాలి. కాగా, ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా నేలపాడులోని హైకోర్టులో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అటు నుంచి రాజధాని ప్రాంతంలోకి కూడా వస్తారని రైతులు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates