విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం జరిగిన ఏడాది తరువాత .. ఆలయ పునర్ నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేస్తోంది. ఈ ఉదయం జరిగిన శంకుస్ధాపన సంద ర్బంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు అధికారులతో వాగ్వాదానికి దిగారు. శంకుస్దాపనకు ఆహ్వానంలో అవమానం జరిగిందంటూ అడ్డుకున్నారు. శంకుస్ధాపన శిలాపల కాన్ని తోసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఆయనను వారించేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఆయన ఆందోళనకు దిగారు..
రామతీర్థంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునఃనిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయనగరం రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతి రాజుకు ఊహించని అవమానం జరిగింది. శంకుస్ధాపన సమయంలో కొబ్బరి కాయ కూడా కొట్టనివ్వకుండా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు.. అక్కడే ఆందోళనకు దిగారు. శిలా ఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా.. అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. ఆలయ ధర్మకర్తనైన తనకు చెప్పకుండా శంకుస్థాపన ఏంటి? అని అధికారులను నిలదీశారు. విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఆధారాలు తారుమారు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఎందుకు దుండగులను పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆలయానికి విరాళం ఇస్తే తిరిగి తన మొహం మీద కొట్టారని.. భక్తులు ఇచ్చే విరాళాలను తిరిస్కరించే అధికారం మీకెక్కడిది అని ఆయన అధికారులను నిలదీశారు..
ఇది ప్రభుత్వ కార్యక్రమం కానే కాదని అన్నారు అశోక్ గజతి రాజు.. తమ పూర్వీకులు 400 సంవత్సారాల క్రితం నిర్మించిన ఆలయం ఇది అని గుర్తు చేశారు. ఏ కార్యక్రమానికి అయినా ఆనవాయితీ ఉంటుందన్నారు. తాను ప్రభుత్వానికి 7 ప్రశ్నలు అడుగుతున్నానని.. వాటిని ఎండోమెంట్ ఉన్నతాధికారులకు పోస్టులో పంపిస్తానని అన్నారు. ఇప్పటి వరకు 115 వరకు దేవాలయ ఘటనలు జరిగాయి.. ఏ రోజు వాటి మీద ఎందుకు ప్రభుత్వం దర్యాప్తు చేయలేదని నిలదీశారు. ప్రశ్నిస్తే తనపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అధికారుల తీరుకు నిరసగా ఆయన అక్కడే బైఠాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు ఆయన్ను అక్కడ నుంచి లేపే ప్రయత్నం చేశారు. దీంతో అశోక్ గజపతి రాజు ప్రతిఘటించారు. వెంటనే ఆయనకు వెనక్కు నెట్టేయడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తన అనుచరులతో పాటు.. అశోక్ గజపతి రాజు అక్కడే కూర్చుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఏడాది క్రితం అంటే గతేడాది డిసెంబర్ 28వ తేదీన రాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడిన దుండగులు.. శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దాంతో ప్రభుత్వం వెంటనే స్పందించి.. ధ్వంసమై విగ్రహం స్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ చేయడంతో పాటు.. ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా మూడు కోట్ల నిధులతో ఈ రామాలయాన్ని నిర్మించనున్నారు. పూర్తి రాతి కట్టడంతో ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయంతో పాటు ధ్వజస్తంభం, వంటశాల మెట్ల మార్గం ఆధునికీకరణ, కోనేరును అభివృద్ధి చేయనున్నారు అధికారులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates