ప్రజల కోసం పోరాడటమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఏడేళ్లు గడిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఆయన ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పటికీ ఆయన పార్టీకి కావాల్సినంత మైలేజీ రాలేదనేది మాత్రం నిజమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ జనసేన పార్టీని పరిపూర్ణమైన రాజకీయ పార్టీగా చూడడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని అంటున్నారు. పవన్ ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లోకి వస్తారని.. ఆ తర్వాత సైలెంట్ అయిపోతారనే విమర్శలు ఓ వైపు ఉన్నాయి. మరోవైపు ఏదైనా ప్రజా సమస్యను తలకెత్తుకుంటే దాని కోసం చివరి వరకూ పోరాడకుంటే మధ్యలోనే వదిలేస్తారనే అపవాదు కూడా ఉంది.
2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన.. ఇటు రాష్ట్రంలో టీడీపీకి, అటు కేంద్రంలో బీజేపీకి మద్దతునిచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో పోటీకి దిగి దారుణమైన ఫలితాలు మూటగట్టుకుంది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కించుకుంది. పోటి చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారు. అయినా ఆ పరాజయాలను పట్టించుకోకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. కానీ మధ్యలో సినిమాలు చేస్తూ తీరిక లేకుండా అయిపోయారు. దీంతో పార్టీలో జోరు కనిపించడం లేదు. మైలేజీ రావడం లేదు. ఇప్పుడా విషయంపై ఫోకస్ పెట్టిన పవన్ అందుకు అమరావతి రైతుల సభను ఉపయోగించుకోవాలనుకుంటున్నారని ప్రచారం మొదలైంది.
అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న ఆ ప్రాంత రైతుల పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని రైతులు నిర్ణయించారు. అందుకు పవన్‌ను ముఖ్య అతిథిగా హాజరవ్వాలని ఆహ్వానించారు. తిరుపతిపై పవన్‌కు ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టి ఆయన ఈ సభకు రావడం ఖాయమే. అందుకు గతంలో తన అన్న చిరంజీవి తిరుపతిలో గెలవడం కావొచ్చు, తమ సామాజిక వర్గం ప్రజలు అక్కడ ఎక్కువగా ఉన్నారనే కారణం కావొచ్చు. 2019 ఎన్నికల్లోనూ ఆయన తిరుపతి నుంచి పోటీ చేయాలని అనుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తన సన్నిహితులు సూచన మేరకు భీమవరం, గాజువాక నుంచి బరిలో దిగినట్లు తెలిసింది. మరోవైపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో పార్టీ పటిష్ఠతపై ఆయన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమానికి పవన్ సంఘీభావం ప్రకటించారు. ఇక ఇప్పుడు అమరావతి రైతుల యాత్రకు కూడా ఆయన మద్దతుగా నిలవబోతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు జై అమరావతి అన్న నేపథ్యంలో.. ఇప్పుడిక పవన్ కూడా అదే నినాదాన్ని ఎత్తుకోనున్నారు. మరోవైపు పవన్‌కు ఈ సభ పార్టీ పరంగానూ కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ సభ పేరుతో ఆయన తిరుపతిలో హడావుడి చేసి పార్టీకి మైలేజీ పెంచాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరి పవన్ వ్యూహం ఫలిస్తుందా అన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates