విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ.. దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్.. సాయంత్రం ఐదు గంటల సమయంలో దీక్ష విరమణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనేక విషయాలను ఆయన స్పృశిం చారు. దీనిలో ప్రధానంగా.. రాజకీయాలు.. సినిమా టికెట్లు, మద్యం, అమరావతి రాజధాని, ఎంపీలు, అసెంబ్లీలో ఇటీవల జరిగిన చంద్రబాబు అవమానకర ఘటన ఇలా..అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా తన సినిమాలపై ప్రభుత్వం కక్ష కట్టిందని పవన్ చెప్పారు. అంతేకాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనను ఆర్థికంగా దెబ్బతీయాని.. వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు.
అందుకే పారదర్శకత పేరుతో.. టికెట్లను ఆన్‌లైన్ చేశారని.. దీనివల్ల ఏం సాధిస్తారని.. ప్రశ్నించారు. ఇదే సమయంలో మద్యం విక్రయాలకు పారదర్శకత ఉందా? అని నిలదీశారు. మద్యాన్ని మీ ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకోవడం లేదా? అని ప్రశ్నించారు. 60 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్‌ను రూ.200లకు విక్రయిస్తున్నారని.. దానికి కూడా పేరూ.. ఊరూ ఉండడం లేదని విరుచుకుపడ్డారు. ఇలా.. అత్యధిక ధరలకు విక్రయిస్తున్న మద్యంలో సీఎం జగన్‌కు వాటాలు వెళ్తున్నాయని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం వ్యాపారంలో వచ్చిన డబ్బును లారీల్లో గట్టి బందోబస్తు మధ్య తీసుకెళుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. దీనిలో ఒక్క జగన్‌కే రూ.40 వేల కోట్ల నగదు ముట్టిందన్నారు.
మరి పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మద్యం విషయంలో ఎందుకు ద్వంద్వ విధానాలు అవలంబి స్తోందని పవన్ నిలదీశారు. తనతో పెట్టుకుంటే.. మంచిదికాదన్న పవన్.. ప్రభుత్వ అవినీతిని వెలికితీస్తామని హెచ్చరించారు. తాను అవసరమైతే.. తన సినిమాలను ఉచితంగా రిలీజ్ చేయిస్తానని.. ప్రకటించారు. రూ.200 పెట్టి మద్యం అమ్ముతున్నవారు.. వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించే సినిమాలను మాత్రం రూ.5 చూపిస్తారా? అని నిలదీశారు. మీకు సినిమాల నుంచి నిర్మాతల నుంచి ముడుపులు రావు కాబట్టే.. వీటిపై పెత్తనం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అదేమద్యంపై ఇష్టానుసారంగా.. వసూళ్లు చేస్తారా? అని పవన్ నిలదీశారు.
యూపీ, బిహార్ రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అథమంగా ఉంటాయని అంటుంటారని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటిని మించిపోయిందని పవన్ అన్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే రౌడీయిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం స్థాయి వ్యక్తిని, ఆయన సతీమణి గురించి దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. విపక్ష నేత భార్యనే అసెంబ్లీలో దూషిస్తే.. వీధిలో మహిళలకు రక్షణ ఏముంటుందని నిలదీశారు పవన్. చట్టసభల్లో బూతులే శాసనాలు అవుతున్నాయని ఆగ్రహించారు. ఇలాంటి సర్కారును గద్దె దించాలన్న పవన్… 2024లో వచ్చే కొత్త ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates