వచ్చే ఏడాది దేశంలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచి దృష్టి సారించాయి. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తా చాటడం పార్టీలకు కీలకం. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో అయితే ఎన్నికలు రణరంగంలా మారిపోయాయి. 403 అసెంబ్లీ సీట్లున్న ఆ రాష్ట్రంలో గెలిస్తే దాని ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉంటుంది. అందుకే అక్కడ అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ.. తిరిగి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యూహాలు రచిస్తున్నాయి.
పోటీలో ఒంటరిగానే..
దేశంలో తిరిగి రాజకీయ ప్రభ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. అందుకు ప్రధానమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ దిశగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీలో మకాం వేసి పార్టీ విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వం ప్రారంభించిన ఆమె.. కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే తమ పార్టీ పోటి చేస్తుందని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోయినప్పటికీ అధికారంలోకి రాగలమనే ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేసేందుకు మొగ్గు చూపడం లేదని తెలిసింది.
ఆ వ్యతిరేకత వద్దని..
యూపీలో అత్యధిక సార్లు ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీ కాంగ్రెస్సే అనడంలో సందేహం లేదు. 1951, 57, 62, 67, 69, 74, 80, 85 ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు కట్టబెట్టారు. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఆ పార్టీ ఇప్పుడు దాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లి ఒంటరిగానే బరిలో నిలిచి గెలవాలని అనుకుంటోంది. 2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. పొత్తులో భాగంగా కేవలం 114 స్థానాల్లోనే పోటీ చేసిన కాంగ్రెస్ 7 స్థానాల్లో మాత్రమే గెలిచింది. మోడీ ప్రభ కారణంగా బీజేపీ అనూహ్యంగా 312 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా పొత్తు పెట్టుకుంటే మళ్లీ తక్కువ స్థానల్లోనే పోటీ చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అంతే కాకుండా పొత్తు పెట్టుకున్న పార్టీకి ప్రజల్లో ఉండే వ్యతిరేకత కూడా తమ పార్టీపై ప్రభావం చూపిస్తుందని ప్రియాంక అనుకుంటున్నట్లు తెలిసింది. అందుకే సోలోగానే బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు దొరుకుతారా? అన్నది సందేహమే. మరి సోలోగా పోటీ చేసే కాంగ్రెస్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on November 15, 2021 2:49 pm
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…