లక్షలాది ఉద్యోగులు ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిటి (పీఆర్సీ) నివేదిక సిఫారసులు అమలు చేయటం బాగా వివాదాస్పదమవుతోంది. పీఆర్సీ నివేదికను అమలు చేయటం అన్నది ప్రభుత్వం విధి. దానికన్నా ముందు ఉద్యోగసంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో లేదా ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటితో మాట్లాడి బేరసారాలు చేయడం కూడా మామూలే. ఎందుకంటే నివేదికలో సిఫారసు చేసినట్లు ఫిట్ మెంట్ ను ఉద్యోగ సంఘాలు అంగీకరించవు.
అలాగే ఉద్యోగసంఘాల డిమాండ్ చేసినంత ఫిట్మెంట్ ను ప్రభుత్వం కూడా ఆమోదించదు. కాబట్టి మధ్యేమార్గంగా మంత్రుల కమిటి, ఉద్యోగసంఘాల నేతల మధ్య బేరసారాలు జరిగి ఏదో ఓ శాతం దగ్గర అంగీకారం కుదురుతుంది. దాని తర్వాత సదరు నివేదికను ఎప్పటి నుంచి అమలు చేయాలని, పాత బకాయిల విషయంలో కూడా చర్చలు జరిగే చివరకు ఏదో ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందం ప్రకారమే పీఆర్సీ నివేదిక అమలవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. పీఆర్సీ అమలయ్యే లోగా ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్)అమలవుతుంది. ఇపుడు 27 శాతం ఐఆర్ అమలవుతోంది.
ఈ పద్దతి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఉద్యోగసంఘాల నేతలుగా ఎవరున్నా జరిగేదిదే. అయితే గతంలో ఎన్నడు లేనివిధంగా ఇపుడు పీఆర్సీ నివేదిక అమలు వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి మీదే ప్రధానంగా పీఆర్సీ నివేదిక అమలు ఆధారపడుటుంది. ఇపుడు రాష్ట్ర ఆర్ధికపరిస్దితి ఏమాత్రం బాగాలేదని తెలిసిందే. అప్పులతోనే ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి స్థితిలో ఉద్యోగ సంఘాలు పీఆర్సీ నివేదిక అమలుకు పట్టుబడుతున్నాయి.
ఇదే సమయంలో పీఆర్సీ నివేదిక ఎలా అమలు చేయాలన్నది ముఖ్యమంత్రి తలనొప్పి. ఆర్ధిక పరిస్థితి తో సంబంధం లేకుండా తమకు మంచి జీతాలు రావాలనే ఉద్యోగులు కోరుకుంటారు. అయితే ఇక్కడ సమస్యేమిటంటే పీఆర్సీ నివేదికను తమ పరిశీలనకు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతల ప్రభుత్వాన్ని పదే పదే ఎందుకు డిమాండ్ చేయాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చింది ? నివేదిక కాపీని ఉద్యోగసంఘాల నేతలకు ఇవ్వటమన్నది ప్రభుత్వం కనీస బాధ్యత. నివేదిక కాపీని నేతలకు ఇవ్వటం వేరు, నివేదిక అమలు వేరని ప్రభుత్వానికి తెలీదా ?
పీఆర్సీ నివేదికపై ప్రభుత్వంతో చర్చలు జరపాలంటే నివేదిక కాపీని చూడందే ఉద్యోగసంఘాల నేతలు ఏమి మాట్లాడగలరు ? ఇంతచిన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఎందుకు పెద్దది చేసుకుంటున్నదో అర్థం కావటంలేదు. ముఖ్యమంత్రికి ఒకమాట చెప్పి నివేదిక కాపీని ఉద్యోగసంఘాల నేతలకు ప్రధాన కార్యదర్శి ఎప్పుడో ఇచ్చుండాల్సింది. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటోందనే సామెతలో చెప్పినట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. ఇదే విషయమై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలతో ప్రభుత్వం సమావేశమవుతోంది. పీఆర్సీ నివేదిక కాపీని వెంటనే ఉద్యోగ సంఘాల నేతలకు ఇచ్చేస్తే సగం సమస్య పరిష్కారమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates