ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి జనసేనను స్థాపించిన పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కష్టపడుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్న పవన్ తన సొంత సామాజిక వర్గమైన కాపు ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు అడుగులు వేస్తున్నారు. అధికార వైసీపీపై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం పవన్ ఇంత కష్టపడుతుంటే.. మరోవైపు పార్టీలోని మరో కీలక నేత కూడా పవన్‌ను వదిలేస్తారనే ప్రచారం జనసేన శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ఇటీవల టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని పవన్ ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే అంశం కారణంగా జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయనే ప్రచారం సాగుతోంది. టీడీపీ విషయంలో పవన్ వెంటనే స్పందించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పార్టీలో అన్ని వర్గాల నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడీ వ్యవహరం వల్ల పవన్‌కు పార్టీలోనీ ముఖ్యనేత అయిన నాదెండ్ల మనోహర్‌కు మధ్య గ్యాప్ వచ్చిందని సమాచారం. ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్.. పవన్‌కు రాజకీయంగా దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ వ్యూహాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీలో పవన్ తర్వాత ఎవరంటే ఆయన పేరే వినిపిస్తోంది.
జనసేనలో కీలక నేత అయిన నాదెండ్ల ఇప్పుడు పవన్ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ పార్టీ కార్యాలయాలపై పవన్ కాస్త ఆలోచించి మాట్లాడాల్సిందని ఆయన భావించినట్లు సమాచారం. ఓ సీఎంని బూతులతో విమర్శించిన పార్టీపై దాడులపై పూర్తి స్థాయిలో విషయం తెలుసుకోకుండా పవన్ ముందే మాట్లాడటంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లినట్లు అయిందని నాదెండ్ల అన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడీ అభిప్రాయభేదాల కారణంగా ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందనే ప్రచారం సాగుతోంది.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ చాలా మంది నాయకులు పార్టీ నుంచి తప్పుకున్నారు. ముఖ్యంగా తాను పార్టీ పెట్టేందుకు రాజా రవితేజ ప్రధాక కారణమని పవన్ ఎన్నోసార్లు చెప్పారు. కానీ కొద్దిరోజులకే రవితేజ.. జనసేన నుంచి బయటకు వచ్చి పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొంతకాలం తర్వాత పార్టీని వీడారు. పవన్ సినిమాలు చేయడం నచ్చకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు ఆయన ప్రకటించారు. మరి ఇప్పుడు పవన్‌తో అభిప్రాయ భేదాల నేపథ్యంలో నాదెండ్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ జోరుగా సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates