వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖను చూస్తున్న ఓ మంత్రి తాజాగా నేరుగా ముఖ్యమంత్రితోనే ఫైరయ్యారనే వ్యాఖ్యలు వైసీపీ నేతల మధ్య గుసగుసగా సాగుతున్నాయి. “ఈ సారి మేనిఫెస్టో ఇలా వద్దు సార్!!” అంటూనే.. మీరు హామీలు ఇచ్చి.. మౌనంగా ఉంటారు.. డబ్బులు తేలేక మేం ఛస్తున్నాం!! అంటూ.. ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారట. పేరు చెప్పేందుకు ఎవరూ సాహసించడం లేదు కానీ.. ఆ మంత్రి మాత్రం సీఎంపైనే ఫైరయ్యారనేది వాస్తవం అంటున్నారు. అయితే.. ఇదంతా ఓ కీలక సలహాదారు.. సమక్షంలో జరగడంతో అటు ఇటుగా ఆలస్యంగా బయటకు వచ్చింది.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఈ విషయాన్ని తరచుగా ముఖ్యమంత్రి సైతం బయటకు చెప్పేస్తున్నారు. “రాష్ట్రం అనేక కష్టాల్లో ఉన్నప్పటికీ..” అంటూ.. ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే.. ఇటు రియల్ ఎస్టేట్ లేక పోవడంతో.. రిజిస్ట్రేషన్లు ముందుకు సాగక.. ప్రభుత్వానికి నిధులు రావడం లేదు. మద్యంపై ధరలు ఒక్కటే ఇప్పుడు సర్కారు అంతో ఇంతో ఆదరణగా మారాయి. మరోవైపు హద్దులు మీరిన అప్పులు చేస్తున్నారంటూ. కేంద్రం నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఆర్బీఐ కూడా ఎప్పటికప్పుడు కొర్రీలు వేస్తోంది. దీంతో కొత్తగా అప్పులు చేయాలంటే.. ఇబ్బందిగానే ఉంది.
కానీ, రెండు నెలలు తిరిగే సరికి కొత్తగా అమలు చేయాల్సిన పథకాలు.. ఇప్పటికే ఉన్న పథకాలకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో డబ్బులు తీసుకురావాల్సిన బాధ్యతలను తనే చూడాల్సి వస్తోందని.. దీంతో తాను అసలు నియోజకవర్గంలో కూడా కాలు పెట్టలేకుపోయిందని.. ఉన్న సమయం అంతా కూడా ఇలా పోతే.. కుటుంబానికి సైతం సమయం కేటాయించలేకపోతున్నానని.. సదరు .. మంత్రి వర్యులు.. ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాదు.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన కీలక సూచనలు చేశారట.
“ఇలాంటి మేనిఫెస్టోలు ఇకపై వద్దు. ఇప్పటి వరకు ఇచ్చింది చాలు. వచ్చే ఎన్నికల్లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా.. పథకాలు రూపొందిద్దాం. అవి కూడా సక్సెస్ అవుతాయి” అంటూ.. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను.. ఆయన చదవి వినిపించారట. అయితే.. ఇదంతా విని.. సహజంగానే సీఎం కోప్పడతారని ఎవరైనా అనుకుంటారు. కానీ, సీఎం మాత్రం.. నీ బాధ నాకు అర్ధమైంది.. కొంత శాంతించు! అని ఒక్కనవ్వు నవ్వేశారట. ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేతల మధ్య సాగుతున్న సరదా సంభాషణ. మరి నిజంగానే మేనిఫెస్టోలో భారమైన వాటిని తగ్గిస్తారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates