మోడీకి రివర్స్ షాకిస్తున్న సొంత ఎంపి

ఉత్తరప్రదేశ్ ఘటన విషయంలో నరేంద్ర మోడీకి సొంత పార్టీ ఎంపీయే రివర్స్ షాకిస్తున్నారు. మొన్నటి ఆదివారం యూపీలో ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న రైతులపై కార్లు దూసుకెళ్ళిన ఘటన ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఘటనలో నలుగురు రైతులు మరణిస్తే తర్వాత జరిగిన గొడవల్లో మరో నలుగురు మరణించారు. ఘటన జరిగిన రోజు నుంచి బీజేపీ పిలిబిత్ ఎంపి పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వరుణ్ గాంధీ మరోవైపు కేంద్రాన్ని కూడా నిలదీస్తున్నారు.

రైతు మరణాలపై ఒకవైపు రాష్ట్రం మొత్తం భారతీయ కిసాన్ సంఘాల ఆందోళనలు, మరోవైపు ప్రతిపక్షాల ఐక్య ఉద్యమాలతో అట్టుడుకిపోతోంది. కిసాన్ సంఘ్ నేతలను సముదాయించలేక, ప్రతిపక్షాల నేతలను నియంత్రించలేక రాష్ట్ర ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. ఇలాంటి సమయంలోనే సొంత పార్టీ ఎంపీలే ప్రతిపక్షాల చేతికి మరిన్ని అస్త్రాలు ఇస్తున్నట్లుగా వ్యవహరించడాన్ని నరేంద్ర మోడీ సర్కార్ తట్టుకోలేకపోతోంది.

ఆదివారం జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇప్పటివరకు వరుణ్ గాంధీ మూడు వీడియోలుగా పోస్టుచేశారు. తాజాగా గురువారం పోస్టుచేసిన వీడియో వైరల్ గా మారింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు ప్రమాదానికి సంబంధించిన ఘటన స్పష్టంగా కనపించలేదు. కానీ తాజాగా బీజేపీ ఎంపీ పోస్టుచేసిన 31 సెకన్ల వీడియా మాత్రం చాలా స్పష్టంగా ఉంది. రైతులు ర్యాలీలు రోడ్డుపై వెళుతుండగా వాళ్ళ వెనుకనుండి వేగంగా వచ్చిన రెండ వాహనాలు రైతులపై నుండి దూసుకవెళ్ళటం స్పష్టంగా కనిపించింది.

అంటే ప్రశాంతంగా ర్యాలీ చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కొడుకు లేకపోతే కొడుకు మద్దతుదారుల వాహనాలు దూసుకెళ్ళినట్లు అర్ధమవుతోంది. దీనిపైన రైతుసంఘాలు, ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. అందుకనే గడచిన ఐదురోజులుగా రాష్ట్రం మొత్తం అట్టుడుకిపోతోంది. విచిత్రమేమిటంటే అన్నీవైపుల నుండి పెరిగిపోతున్న ఒత్తిడికి తట్టుకోలేక పోలీసులు కేంద్రమంత్రి కొడుకు మీద కేసు నమోదుచేసినా అరెస్టు చేయలేదు. ఇదే విషయాన్ని రైతుసంఘాలు, ప్రతిపక్షాలతో పాటు వరుణ్ గాంధి కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

వరుణ్ వరసచూస్తుంటే కిసాన్ సంఘ్ నేతలతో పాటు ప్రతిపక్షాలతో చేతులు కలిపినట్లే ఉంది. ఎందుకంటే వ్యవసాయ చట్టాలపై నరేంద్రమోడి నిర్ణయాన్ని గతంలో కూడా నిలదీశారు. ఉద్యమం చేస్తున్న రైతుసంఘాలకు మద్దతుగా మాట్లాడారు. ఉద్యమం హద్దులు దాటిపోక ముందే కేంద్రప్రభుత్వం మేల్కొనాలని పదే పదే మోడితో పాటు కేంద్రప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తులు చేశారు. అయితే వరుణ్ గాంధిని కేంద్రంలోని పెద్దలు ఎవరు పట్టించుకున్నట్లులేదు. అందుకనే ఇఫుడు యాక్టివ్ అయిపోయి పదే పదే వీడియోలు షేర్ చేస్తున్నారు.