జనసేన, ఏపీ ప్రభుత్వం మధ్య పచ్ఛన్నయుద్ధం నడుస్తోంది. ఇటీవల ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభుత్వం, వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై మంటలు చల్లారలేదు. ఒకరిపై మరొకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ జనసేన వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏపీలోని రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అందులో కాటన్ బ్యారేజీపై అక్టోబర్ 2వ తేదీన శ్రమదానం చేయాలని అనుకున్నారు.
ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఇరిగేషన్ శాఖకు అనుమతిని కోరారు. అయితే కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమదానం కార్యక్రమానికి అనుమతి లేదని ఇరిగేషన్ ఎస్‌ఈ స్పష్టం చేశారు. ఎస్‌ఈ కొన్ని సాంకేతిక కారణాలను ప్రస్తావించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు. కేవలం ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్ అండ్ బి పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్‌ఈ ప్రకటించారు. జనసేన తలపెట్టిన శ్రమదానం కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంచి పని చేస్తున్నామని, ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం, రోడ్ల మరమత్తులు చేయపడ్డడం లేదని, అందువల్ల తామే ముందుకు వస్తున్నామని మనోహర్ తెలిపారు.
అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్‌పై శ్రమదానం చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డు మరమ్మతుల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు కార్యక్రామాల్లో పవన్ పాల్గొనేలా ఆ పార్టీ ఇప్పటికే ప్లాన్ కూడా చేసుకుందని చెబుతున్నారు. ఈ రెండు కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని జనసేన కార్యాలయం పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో పవన్ చర్చించనున్నారు. అన్ని నియోజకవర్గాలలో జన సైనికులు, ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించనున్నారు.
ఇటీవల రాష్ట్రంలోని రోడ్లను బాగు చేయాలని జనసేన సోషల్ మీడియాలో జనసేన విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తులు చేసేందుకు శ్రమదానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే అక్టోబర్ 2న ధవళేశ్వరం వద్ద నిర్వహిస్తున్న శ్రమదానానికి ఇరిగేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. జనసేన నేతలు ఖచ్చితంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఒకవైపు పవన్ వరుసగా మంత్రులపై వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో జనసేన నిర్వహిస్తున్న శ్రమదానం కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates