పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఆవేశానికి మారుపేరులా ఉండేవాడు. ప్రజారాజ్యం తరఫున రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చాలా దూకుడుగా వ్యవహరించేవాడు. కానీ సొంతంగా పార్టీ పెట్టాక ఆయన ఆవేశం, దూకుడు చాలా వరకు తగ్గింది.
ఊరికే ఆవేశపడిపోకుండా ఆచితూచి మాట్లాడ్డం వరకు ఓకే కానీ.. ప్రత్యర్థులు ఎలా పడితే అలా తిడుతుంటే, లేనిపోని ఆరోపణలు చేస్తుంటే పవన్ వారిని దీటుగా ఎదుర్కోకుండా.. మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ఏంటి.. సైలెంటుగా ఉండటం ఏంటి అన్నది అభిమానుల అభ్యంతరం. ఐతే ఈ విషయంలో పవన్ ఇప్పుడు మారుతున్నట్లే కనిపిస్తోంది.
అభిమానులు కోరుకున్న తరహాలోనే మొన్న రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పేలిపోయే ప్రసంగం చేశాడు పవన్. అందులో వైసీపీ నాయకుల్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. ఆ ప్రకంపనలు మూడు రోజుల తర్వాత కూడా కొనసాగుతున్నాయి.
పవన్‌ను ఎదుర్కొనేందుకు ఒక్కొక్కొరుగా వైసీపీ నేతలు, మద్దతుదారులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి రంగంలోకి దిగారు. పవన్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఐతే వైకాపా నేతలు, మద్దతుదారుల ఎదురు దాడికి పవన్ చాలా సింపుల్‌కు, దీటుగా ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చాడు. ఆయన చేసిన రెండు ఫైర్ బ్రాండ్ ట్వీట్లు వైరల్ అయిపోయాయి.
ముందుగా.. తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే…అంటూ ఒక ట్వీట్ వేసిన పవన్.. ఆ తర్వాత హూ లెట్ దీస్ డాగ్స్ ఔట్ అనే పాపులర్ పాప్ సాంగ్ లింక్ షేర్ చేశాడు. ఒక ట్వీట్ ద్వారా తనను విమర్శిస్తున్న వైకాపా నేతలు, మద్దతుదారులను పరోక్షంగా కుక్కలు అని పేర్కొన్న పవన్.. తన మీదికి ఆ కుక్కల్ని ఎవరు వదిలారో తెలుసు అనే సంకేతాన్ని మరో ట్వీట్ ఇచ్చాడు. పవన్ ట్వీట్లు జనసైనికులకు మామూలు కిక్ ఇవ్వలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates