చింతమనేని ప్రభాకర్. తరచుగా మీడియాలోకి వస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వరుస విజయాలు దక్కించుకున్న చింతమనేని.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ యువ నాయకుడు.. అబ్బాయి చౌదరి విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి చింతమనేని గెలిచి ఉండాలి. కానీ, కొద్ది తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే.. గెలుపు ఓటములను సమానంగా భావించిన ఆయన.. ఆదిలో టీడీపీ తరఫున బాగా దూకుడు చూపించారు. చంద్రబాబు పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
అయితే.. జగన్ సర్కారు పగబట్టినట్టు ఆయనపై కేసులు నమోదు చేయించింది. అంతేకాదు.. కేసులపై కేసులు పెట్టి.. ఆయనను జైలు పాలు చేసింది. ఒక కేసులో ఇలా బెయిల్‌పై బయటకు వస్తే.. మరో కేసులో అలా జైల్లోకి వెళ్లిన సందర్భం కూడా ఉంది. దీంతో కొన్నాళ్లుగా చింతమనేని మౌనంగానే ఉంటున్నారు. ఇక, ఇదిలావుంటే.. తమకేదో చేస్తారని.. భావించిన అబ్బాయి చౌదరి స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదనే టాక్ బాగానే ఉంది. మరీ ముఖ్యంగా పక్కనే పట్టిసీమ ఉన్నప్పటికీ.. ఇక్కడ రైతులు నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.
అదేసమయంలో ఉపాధి హామీ పనుల్లోనూ అవకతవకలు జరిగాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా కొందరికే అందుతున్నాయనే విమర్శలు వచ్చాయి. ఇదిలావుంటే.. ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కేవలం మాటల మనిషిగా మారిపోయారనే వాదన రైతుల నుంచి ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తోంది. ఇది ఆయనపై వ్యతిరేకతను పెంచిందని కొన్నాళ్లుగా పార్టీలోనూ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో రైతులు తమ సమస్యను చెప్పుకొనేందుకు చింతమనేని ఇంటికి క్యూకడుతున్నారు. అయితే.. ఆయన మాత్రం తనకు సంబంధం లేదని.. ఎమ్మెల్యేనే వెళ్లి అడగాలని సమాధానం ఇస్తున్నారు.
ఎందుకంటే.. పట్టిసీమ నుంచి దెందులూరు డెల్టా రైతులకు నీరు అందించేందుకు చింతమనేని హయాంలో వేసిన పైపు లైన్ పనులు నిలిచిపోయాయి. ఇవి చింతమనేని హయాంలో వేసినవి కావడంతో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పట్టించుకోవడం లేదు. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కోసం వారు డిమాండ్ చేస్తున్నారు. అబ్బాయి చౌదరి.. మాత్రం కేవలం ఆఫీసు గడప దాటకుండా.. తాడేపల్లి.. హైదరాబాద్.. దెందులూరు ఆఫీస్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు స్థానిక ఎస్సీలు కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. చింతమనేనికి ఇప్పుడు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. గతంలో చింతమనేని ఒకింత దూకుడు ప్రదర్శించినా.. కనీసం తమ సమస్యలు విన్నారని.. పరిష్కరించే ప్రయత్నం కూడా చేశారని.. ఇక్కడి రైతుల నుంచి చింతమనేనికి సింపతీ పెరుగుతోంది. ఈ పరిణామం.. నిజానికి వైసీపీ నేతలకు నచ్చడం లేదు. మరీ ముఖ్యంగా.. అబ్బాయి చౌదరికి కంటిపై కును కు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే చింతమనేనిపై కసి తీర్చుకుని, ఆయనను డైల్యూట్ చేసేందుకు అవకాశం కోసం .. ఎదురు చూస్తున్నారని..కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. ఈ పరిణామమే ఇటీవల పెట్రో నిరసన ను అవకాశంగా చేసుకున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఇక్కడ చిత్రమైన విషయ ఏంటంటే.. చింతమనేనిపై నమోదువుతున్న కేసులతో ఆయన పేరు తగ్గిపోతోందని వైసీపీ నేతలు భావిస్తుంటే.. అనవసరంగా చింతమనేనిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ.. ఇక్క డి రైతులు, ప్రజల్లో సింపతీ ఏర్పడడం గమనార్హం. ఇది మున్ముందు పెరిగితే.. ఖచ్చితంగా చింతమనేనికి అవసరమైన రెడ్ కార్పెట్ పరిచినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చింతమనేనిపై ఇక్కడి ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. గత ఎన్నికల్లో అయినా.. చిన్న మార్పును కోరుకున్నారు అంతే! ఈ మార్పును అబ్బాయి చౌదరి నిలబెట్టుకోలేక పోతున్నారనే వాదన అటు పార్టీలోను, ఇటు ప్రజనల్లోనూ వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates