ఆఫ్ఘనిస్ధాన్లోని జనాలను వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసింది. సోమవారం అర్ధరాత్రి దేశంలో మిగిలిన అమెరకా పౌరులను, సైనికులను తీసుకుని లార్జ్ సీ-17 విమానం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వెళ్ళిపోయింది. దీంతో ఆఫ్ఘన్లో అమెరికా పౌరుడు, సైనికులు టార్చిలైట్ వేసి వెతికినా ఇక కనబడరన్నట్లే. అందుకనే చివరి విమానం కాబూల్ నుండి ఎగిరిపోగానే తాలిబన్లు పండగ చేసుకున్నారు.
ఇప్పటికే అరాచకాలకు పాల్పడుతున్న తాలిబన్లకు అమెరికా సైన్యం కాబూల్ లోనే ఉండటంతో కొంత ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఇకనుండి తాలిబన్ల అరాచకాలకు ఆఫ్ఘన్లో అడ్డన్నదే ఉండదని తేలిపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ఇపుడు యావత్ ప్రపంచం మూల్యం చెల్లించాల్సొస్తోంది. 20 ఏళ్ళు ఆప్ఘన్లో ఉన్న అమెరికా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే అది కేవలం తాలిబన్లకు మాత్రమే అని చెప్పాలి.
దేశంలో నుంచి అమెరికా సైన్యాన్ని అర్ధాంతరంగా ఉపసంహరించడం వల్ల యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, అత్యంత ఆధునికమైన ఆయుధాలు, యుద్ధాల్లో వాడే పటిష్టమైన సామర్ధ్యం కలిగిన వాహనాలు+70 టన్నుల తుపాకులు, బుల్లెట్, ఆయుధ సామగ్రి అక్కడే వదిలేయడంతో అవి తాలిబన్ల చేతికి చిక్కాయి. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కాబూల్ విమానాశ్రయంలో ఉండిపోయిన కొన్ని విమానాలు, హెలికాప్టర్లను మాత్రం తాలిబన్లు ఉపయోగించటానికి వీల్లేకుండా నిర్వీర్యం చేసి వదిలేసినట్లు అమెరికా రక్షణశాఖ స్వయంగా ప్రకటించింది.
అమెరికా చేసిన పని వల్ల దేశంలోని జనాలంతా చావలేక, బతకలేక నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లపైనే తాలిబన్లు అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళల విషయంలో చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నారు. 20 ఏళ్ళల్లో అనుభవించిన స్వేచ్ఛను ఆఫ్ఘన్ దేశ ప్రజలు ఒక్కసారిగా కోల్పోయినట్లే. దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు అమెరికానే కారణమంటూ తీవ్రంగా మండి పోతున్నారు జనాలు. దేశంలోని అరాచకం వల్ల ఒక బ్రెడ్ ప్యాకెట్ సుమారు మన కరెన్సీలో రూ. 7 వేలట.
డబ్బు లేని వాళ్ళే కాదు ఉన్నవారు కూడా ఆప్ఘన్లో ఒకే విధమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద ఆహార నిల్వలు అయిపోతున్నాయి. డబ్బులున్నా జనాలకు ఆహారం దొరకట్లేదట. బ్యాంకుల్లో డబ్బులేదు, షాపుల్లో ఆహారం లేదు. ఆసుపత్రుల్లో వైద్యం దొరకటం లేదు. ఉన్నదల్లా తాలిబన్ల చేతుల్లో ఆధునిక ఆయుధాలు మాత్రమే. కేవలం తాలిబన్ల ఫైటర్లకు మాత్రమే కావాల్సినంత ఆహారం, మందులు దొరుకుతున్నాయట. అందుకనే ప్రస్తుత తమ దుస్థితిని తలచుకుని దేశ ప్రజలు అమెరికాను శాపనార్ధాలు పెడుతున్నారు.