వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కాస్త భిన్నమైన వ్యక్తిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుగా చెబుతారు. మిగిలిన వారి రూట్ కు భిన్నమైన బాటలో ఆయన పయనిస్తుంటారు. ప్రధాని మోడీ సైతం ఆయన్ను పేరు పెట్టి పిలిచేంత దగ్గరతనం ఆయన సొంతం. అంతేనా.. మోడీషాల అపాయింట్ మెంట్ కావాలంటే ముఖ్యమంత్రి జగన్ కంటే ముందే ఈ ఎంపీకి ఇస్తారన్న టాక్ వినిపిస్తూ ఉంటుంది.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా.. ఢిల్లీలో బీజేపీ ఎంపీగా ఆయన్ను అభివర్ణిస్తారు. అయితే.. ఈ వాదనను కొట్టిపారేస్తుంటారు. తాను ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అని చెప్పుకుంటూనే.. ఢిల్లీలో మాత్రం ఎంపీగా తనను గుర్తిస్తారని చెబుతారు. కాకుంటే.. బీజేపీ ఎంపీ అన్న ముద్రను మాత్రం ఒప్పుకోరు. ఇంతకీ ఆయనకు అలాంటి పేరు ఎందుకు వచ్చిందన్న మాటకు ఆయన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో బీజేపీ ఎంపీలంతా ఒక చోట కూర్చుంటారని.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలంతా మరో చోట కూర్చుంటామని.. అలాంటప్పుడు ఈ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. బీజేపీతో సన్నిహితంగా లేకుండా.. సీపీఐ,సీపీఎంతో కలిసి ఉండలేం కదా?అని ప్రశ్నిస్తారు. పార్టీ మెచ్చుకునే స్థాయిలో లేకున్నా.. నొచ్చుకునే మాదిరి మాత్రం తాను వ్యవహరించనని చెప్పారు. ఈ రోజున రాష్ట్రానికి ఏదైనా పని చేయించుకోవాలంటే బీజేపీ నేతల సహకారం అవసరమని.. అలాంటప్పుడు వారితో కలవటం తప్పు కాదు కదా? అన్నది ఆయన వాదన.
మోడీషాల అపాయింట్ మెంట్ ముఖ్యమంత్రి జగన్ కంటే కూడా రఘురామ కృష్ణంరాజుకే ముందుగా ఇస్తారన్న మాటకు ఆయన తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కేంద్రం తీసుకొచ్చే పలు పథకాలకు సంబంధించి మార్పులు.. చేర్పులు చేయాల్సి వస్తే వారి వద్దకు వెళ్లి వివరిస్తానని.. ఆ అలవాటుతో వారితో మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. పలు సందర్భాల్లో తాను చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు. మొత్తానికి జగన్ పార్టీ ఎంపీల్లో మిగిలిన వారికి భిన్నమైన క్యారెక్టర్ రఘురామ కృష్ణంరాజు అనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates