టీఆర్ఎస్ అగ్రనేత, ఆర్ధిక మంత్రి హరీశ్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో తనపై అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారని ఈటల ఆరోపించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని రాజేందర్ విమర్శించారు. తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, తనపై కేసీఆర్ కుట్రలు చేశాడని ఈటల ఆరోపించారు. వారి అబద్ధాల పత్రిక, ఛానల్లో పదేపదే చూపించారని అన్నారు. ఆ వార్తలు చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గం వారికి హరీష్ రావు దావత్, డబ్బు ఇస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. మెప్పుపొందాలనే హరీష్రావు చూస్తున్నాడని, అయితే ఆయనకు తన గతే పడుతుందని జోస్యం చెప్పారు. మీ పార్టీలో గెలిచా అన్నారుగా.. అందుకే రాజీనామా చేశానని ఈటల కౌంటరిచ్చారు.
డబ్బు, ప్రలోభాలను పాతరేసే సత్తా హుజురాబాద్ ప్రజలకుందని స్పష్టం చేశారు. తమతో తిరిగే యువకుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని రాజేందర్ ఆరోపించారు. అందరినీ బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఈటల వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates