పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రికి తొందరలో పదవీ గండం తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరద్ సింగ్ రావత్ రాజీనామా నేపధ్యంలో ఇపుడందరి దృష్టి మమతా బెనర్జీపై పడింది. ఎంపిగా ఉన్న రావత్ ఆరుమాసాల్లో ఎంఎల్ఏగా పోటీచేసే అవకాశం లేకపోవటంతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఎంఎల్ఏగా కానీ లేదా ఎంఎల్సీగా కానీ నేత ముఖ్యమంత్రి అయితే ఆరుమాసాల్లో ఏదో ఓ సభనుండి ఎన్నిక కావాలన్నది ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధన. ఒకవేళ అలా ఎన్నిక కాలేకపోతే సీఎంగా రాజీనామా చేయాల్సుంటుంది. ఉత్తరాఖండ్ లో రావత్ కు ఇలాంటి ఇబ్బంది రావంతోనే రాజీనామా చేసేశారు. ఉత్తరాఖండ్ షెడ్యూల్ ఎన్నికల్లో వచ్చే మార్చిలో జరగబోతున్నాయి.
ఏడాదిలోపు కాలవ్యవధి ఉన్న అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఒకసీటులో ఉపఎన్నిక నిర్వహించదు. పైగా ఇపుడు కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఎక్కడా ఉపఎన్నిక నిర్వహించటంలేదు. ఉత్తరాఖండ్ లో శాసనమండలి లేదు కాబట్టి సెప్టెంబర్ 10లోగా ఎంఎల్ఏగా ఎన్నికవ్వాల్సిందే. షెడ్యూల్ ఎన్నికలు, ప్రస్తుత కరోనా సమస్య కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదు కాబట్టే రాజీనామా చేసేశారు.
ఇక మమతబెనర్జీకి కూడా ఇదే సమస్య ఎదురవ్వబోతోంది. పశ్చిమబెంగాల్లో కూడా శాసనమండలి లేదు కాబట్టి ఎంఎల్ఏగా ఎన్నికవ్వాల్సిందే. మళ్ళీ కరోనా సమస్యే ఇక్కడా ఎదురవుతోంది. నవంబర్ 4వ తేదీకి మమత సీఎంగా బాధ్యతలు తీసుకుని ఆరుమాసాలవుతుంది. కరోనా సమస్య కారణంగా తాము ఉపఎన్నికలు నిర్వహించేది లేదని కేంద్ర ఎన్నికల కమీషన్ అంటే మమత చేయగలిగేదేమీ లేదు. నవంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సిందే.
అయితే ఇక్కడే మరో అవకాశం కూడా మమతకు లేకపోలేదు. అదేమిటంటే రాజీనామా చేసిన తర్వాత ఓ రోజో లేకపోతే రెండురోజులో గ్యాప్ ఇచ్చి మళ్ళీ తానే సీఎంగా బాధ్యతలు తీసుకోవటం. అప్పుడు మళ్ళీ ఆరుమాసాల వరకు మమత సీఎంగా కంటిన్యు అయ్యేందుకు అవకాశం వస్తుంది. ఎలాగూ మూడు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగాల్సుంది. కాబట్టి మమతకు నియోజకవర్గం రెడీగానే ఉంది. కాకపోతే కేంద్ర ఎన్నికల కమీషన్ ఏమి చేస్తుందన్నదే కీలకం.
Gulte Telugu Telugu Political and Movie News Updates