తెలంగాణ అధికార పార్టీ నేతలు.. మంత్రులు.. కొన్ని రోజులుగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై తీవ్ర కామెంట్లు చేస్తున్నారు. ఆయనను నీటి దొంగ అని ఒకరంటే.. కాదు.. గజ దొంగ అని మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇంకొందరు.. ఏకంగా ఆయనను నరరూప రాక్షసుడని.. కూడా అనేశారు. నిజానికి తెలంగాణ వాదంతో సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ఏడేళ్ల తర్వాత.. ఇప్పుడు వైఎస్‌ను తిట్టాల్సిన అవసరం ఏంటి? ఏపీ-తెలంగాణల మధ్య నీటి వివాదాలు ఉంటే.. ఏపీని టార్గెట్ చేసుకుని సీఎం జగన్‌ను కామెంట్ చేయాలి. కానీ.. అనూహ్యంగా ఈ రోచ్చులోకి చనిపోయిన నేతను ఎందుకు లాగుతున్నారు? అనేది కీలక ప్రశ్న.
దీనికి సమాధానం.. లేని పార్టీని చూసి భయపడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. వైఎస్ కుమార్తె.. షర్మిల సొంత కుంపటి పెట్టుకుని.. త్వరలోనే ప్రజల్లోకి పాదయాత్ర రూపంలో అరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు ప్రజల నుంచి మద్దతు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పుంజుకోవడంతోపాటు.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, లోపాలు కూడా టీఆర్ఎస్‌ను ఎంత లేదన్నా భయపెడుతున్నా యి. ఈ సమయంలో.. షర్మిల కనుక అరంగేట్రం చేసి.. సెంటిమెంటును రాజేస్తే.. మరింత కష్టమని భావిస్తున్న టీఆర్ ఎస్ అధిష్టానం.. మంత్రులను, నేతలను ముందుగానే అలెర్టు చేసిందా? అనే సందేహాలు వస్తున్నాయి.
రాజన్న పేరుతో ఏ సెంటిమెంటునైతే.. షర్మిల రగిలించాలని చూస్తున్నారో.. అదే సెంటిమెంటు లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే నీటి వివాదాలను అడ్డు పెట్టుకుని వైఎస్‌ను ఏకేస్తున్నారని చెబుతు న్నారు. అయితే.. ఇది కూడా ప్రమాదమేనని.. కొంత వరకు విమర్శించినా తప్పులేదని, కానీ, అదేపనిగా.. భారీ డైలాగులతో విమర్శించడం వల్ల వ్యతిరేక ఫలితమే వస్తుందని సూచనలు వస్తున్నాయి. ఎక్కడైనా.. కొంత వరకు విమర్శలు చేస్తే.. ప్రజలు అర్ధం చేసుకుంటారు. కానీ, ఇప్పుడు శృతి మించిన ధోరణిలో వైఎస్‌ను ఇన్నేళ్ల తర్వాత ఏకేయడం ప్రారంభిస్తే.. దీనిని రాజకీయ కోణంలోనే చూస్తారు తప్ప.. టీఆర్ ఎస్ ఆశించిన ప్రయోజనం దక్కడం ఉండదని అంటున్నారు. మరి నేతలు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఏం చేస్తారో చూడాలి.