శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిట్రిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమదాలవలసలో ఇప్పుడు సరికొత్త రాజకీయం రాజుకుంటోంది. ఏడాది క్రితం వరకూ మేనల్లుడు ఏం మాట్లాడినా కౌంటర్ ఎటాక్‌కు దిగిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం రూటు మార్చేశారట. పంచాయతీ ఎన్నికలకు ముందు వరకు లోకల్ పాలిటిక్స్ తమ్మినేని సీతారాం వర్సెస్ మాజీ విప్, టీడీపీ నేత కూన రవికుమార్ అన్నట్టు ఉండేది. అలాంటిది తమ్మినేని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మేనల్లుడు, టీడీపీ నేత రవికుమార్ మాత్రం పంథాను మార్చుకోలేదు. అవకాశం చిక్కితే మామను కార్నర్ చేస్తూనే ఉన్నారు.
ఇదే సమయంలో నియోజకవర్గానికి తన కుమారుడిని పరిచయం చేయాలని అనుకున్నారో ఏమో.. కూనపైకి తన కుమారుడు నాగ్‌ను ఉసిగొల్పుతున్నారట తమ్మినేని. పరిషత్ ఎన్నికల సమయంలో జరిగిన ఓ గొడవలో రవికుమార్ ఇరకాటంలో పడ్డారు. కేసులో ఇరుక్కున్నారు. ఇలా కేసుల్లో బుక్కవడం.. బెయిల్ తెచ్చుకోవడం ఆయనకు కొత్తేమీ కాకపోయినా.. దూకుడు మాత్రం తగ్గించడం లేదు. అందువల్లే పంచాయతీ ఎన్నికల నాటి నుంచి వైరిపక్షాల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య నడుస్తోన్న సవాళ్లతో ఆమదాలవలసలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
అప్పట్లో ఆ మామా అల్లుళ్లు…ఇప్పట్లో ఈ మామా అల్లుళ్లు అని చెవులు కొరుక్కుంటున్నారు జనం. ఇక, తమ్మినేని కుమారుడు నాగ్ కూడా దూకుడుగానే ఉన్నారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో విప్‌గా ఇక్కడకు తీసుకువచ్చిన అభివృద్ధి ఏంటని ఆయన కూనను కార్నర్ చేస్తున్నారు. అదే సమయంలో వచ్చేవారు రండి! అంటూ.. టీడీపీ నేతలకు బహిరంగ ఆహ్వానాలే పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో నాగ్‌కు స్పీకర్ తమ్మినేని ఫుల్ పవర్స్ ఇచ్చేశారా? అనే చర్చ రాజకీయ వర్గా్లలో జోరుగా సాగుతుండడం గమనార్హం.
సీఎం జగన్ సైతం నాగ్‌కు సలహాలు ఇవ్వడంతో పాటు రామ్మోహన్ నాయుడిపై పోటీ చేస్తావా ? అని ఇటీవల ప్రశ్నించారట. దీంతో ఆయనే వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది. జగన్ సూచనల మేరకే ఆయన దూకుడు పెంచారని స్థానికంగా చర్చ నడుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates