ఈటలకు అంత సీన్ ఉందా ?

పాండవులన్నారు.. కౌరవులన్నారు.. కురుక్షేత్రమని, ధర్మక్షేత్రమని చాలా చాలా మాటలు మాట్లాడారు బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉపఎన్నికను కురుక్షేత్రంగా పోల్చారు. పాండవులు అంతిమవిజయాన్ని అందుకున్నట్లే ఉపఎన్నికనే కురుక్షేత్రం పోరులో తనదే అంతిమ విజయమని ఢంకా బజాయించకుండానే ఈటల ప్రకటించారు. ఉపఎన్నికల్లో జనాలు కేసీయార్ కు ఏ విధంగా బుద్ధి చెబుతారో అందరు చూస్తారంటు జోస్యంచెప్పారు.

ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలనుకలిసి వరంగల్ జిల్లాలోని కమలాపూర్ గ్రామంలోని తన సొంతింటికి తిరిగివచ్చిన ఈటలకు మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గం హుజూరాబాదే అయినా వరంగల్ జిల్లాలో కూడా పెద్దఎత్తున మద్దతుదారులుండటం విశేషమనే చెప్పాలి. సరే రాజకీయ వేడి ఇంకా ఉందికాబట్టి ఈటలను భారీగా స్వాగత మర్యాదలు జరిగాయి.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణాలో కేసీయారే తిరుగులేని నేత. ఒకవైపు జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రజలు టీఆర్ఎస్ నే ఆదరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రత్యర్దులు బలంగా లేకపోవటమే. దాదాపు అన్నీ పార్టీల్లోను కేసీయార్ తరపున కోవర్టులు పనిచేస్తున్నారనే ప్రచారం నిజమే అన్నట్లుగా ఉంది ప్రతిపక్షాల వ్యవహారం చూస్తుంటే.

తొందరలోనే ఈటల చేరబోతున్న బీజేపీకి హుజూరాబాద్ లో బలం పూజ్యం. కాబట్టి ఉపఎన్నికంటు వస్తే గెలవాల్సింది సొంతబలం మీదే. ఈ విషయంలో రాజేందర్ కు స్పష్టత బాగానే ఉంటుంది. ఇపుడు రాజీనామా చేసినా ఉపఎన్నిక మాత్రం ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలీదు. కరోనా వైరస్ సమస్య పోయేంతవరకు ఉపఎన్నిక జరిగే అవకాశం లేదని మాత్రం అర్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి హుజూరాబాద్ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది.

అంటే ఈటల ఇపుడు రాజీనామా చేస్తే ఉపఎన్నిక మరో తొమ్మిది నెలల తర్వాతే అనుకోవాలి. మరప్పటివరకు ఇప్పటి టెంపోను ఈటెల మైన్ టైన్ చేయగలరా ? ఈలోపు ఎన్నిమార్పులు జరుగుతాయో ఎవరు చెప్పగలరు ? కురుక్షేత్రంలో ధర్మం గెలిచినట్లే తాను కూడా గెలుస్తున్నట్లు ఈటెల చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈటల మరచిపోయిందేమంటే కురుక్షేత్రం ధర్మక్షేత్రం కాదు. ఎన్నో మాయోపాయాలతో జరిగిన యుద్ధం కురుక్షేత్రం. మరి అన్ని మాయోపాయాలు ఈటల దగ్గరున్నాయా ?