బెజ‌వాడ వైసీపీకి ల‌క్ చిక్కుతోందే ?


బెజ‌వాడ వైసీపీలో ప‌రిణామాలు క‌లిసి వ‌స్తున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. విజ‌య‌వాడ‌లోని మూడు ప్ర‌ధాన నియోజ‌క‌వ‌ర్గాలు.. తూర్పు, ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండేళ్ల‌లో ఊహించ‌ని విధంగా పుంజుకుంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌న్‌సైడ్‌గా విజ‌యం సాధించింది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోను, సెంట్ర‌ల్లోనూ వైసీపీ విజయం ద‌క్కించుకోగా.. తూర్పులో మాత్రం టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఇప్పుడు తూర్పు స‌హా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

సెంట్ర‌ల్ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇక్క‌డ నిన్న మొన్న‌టి వ‌ర‌కు యాక్టివ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. ఇటీవ‌ల కార్పొరేషన్ ఎన్నిక‌ల స‌య‌మంలో పార్టీలో త‌లెత్తిన స‌మ‌స్యల కార‌ణంగా.. ఆయ‌న సైలెంట్ అయ్యారు. దీంతో సెంట్ర‌ల్‌లో టీడీపీ జెండా మోసే నాయకుడు క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు అస‌లు.. ఆయ‌న పార్టీలో ఉన్నారో.. లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. టీడీపీపై న‌మ్మ‌కం లేని ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ పుంజుకుంటే అప్పుడు చూసుకోవ‌చ్చులే అన్న‌ట్టుగా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు మ‌రింత‌గా రూట్ క్లియ‌ర్ అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, వెస్ట్‌లో టీడీపీకి ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ఉన్నారు. వీరు కూడా యాక్టివ్‌గా లేక పోవ‌డం.. అస‌లు ఎంపీ వైపు రాజ‌కీయాలు చేయాలా? లేక సొంత‌గా రాజ‌కీయాలు చేయాలా ? అనే డోలాయ‌మానంలో ఉన్నారు. ఇక్క‌డ ఎంపీ గ్రూపు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గ్రూపు, నాగుల్‌మీరా, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్‌ గ్రూపు ఉన్నాయి. అస‌లు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా గ్రూపుల్లో కొట్టుకోవ‌డం త‌ప్పా చేసేదేం లేదు.
ఇదిలావుంటే.. మ‌రో వైపు.. తూర్పులో టీడీపీ పాగా వేసినా.. జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని గ‌ద్దె రామ్మోహ‌న్‌ నిలిచి గెలిచినా.. పార్టీ త‌ర‌ఫున ఎలాంటి యాక్టివ్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం లేదు. దీంతో వైసీపీ త‌ర‌ఫున యువ నాయ‌కుడు.. దేవినేని అవినాష్ దూకుడుగా ఉన్నారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వైసీపీ ఖాతాలో మెజార్టీ డివిజ‌న్లు గెలిపించి దేవినేని స‌త్తా చాటుకున్నారు.

గ‌ద్దెను టార్గెట్ చేయ‌డ‌మే ధ్యేయంగా వైసీపీ అధిష్టానం తూర్పులో అవినాష్‌ను ఓ రేంజ్‌లో ఎంక‌రేజ్ చేస్తోంది. దీంతో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ టీడీపీకి శ్రేణులు ఉండి కూడా చిన్న‌పాటి స‌మ‌స్య‌ల కార‌ణంగా.. పార్టీ పుంజుకోవ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే వైసీపీ నేత‌ల‌కు అందివ‌చ్చిన వ‌రంగా మారింది. మ‌రి ఈ ప‌రిణామాలు మ‌రికొన్నాళ్లు ఇలానే ఉంటే.. టీడీపీ బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలే ఎక్కువుగా ఉన్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు స‌మ‌స్య‌ల‌ను, పంతాల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బెజ‌వాడ తెలుగు త‌మ్ముళ్లు ఏం చేస్తారో ? చూడాలి.