దివంగత కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల పాటు సేవ చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి, అదే పార్టీ జెండా కప్పుకుని తనువు చాలించారు. ఊహించని విధంగా రాజకీయ ఒత్తిడిలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే కోడెల మరణం టీడీపీకి తీరని లోటు అని చెప్పొచ్చు. కోడెల మరణించాక నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయినట్లు కనిపిస్తోంది.
నరసారావుపేట నియోజకవర్గం నుంచి కోడెల అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన కోడెల, 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా నరసారావుపేట వదిలిపెట్టి సత్తెనపల్లిలో పోటీ చేసి విజయం సాధించారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేశారు.
ఇక 2019 ఎన్నికల్లో అదే సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక ఆయన కుటుంబంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాగే కోడెలని టార్గెట్ చేసుకుని వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేసిందన్న విమర్శలూ వచ్చాయి. అటు టీడీపీ అధిష్టానం సైతం కోడెలకి ఆయన స్థాయికి తగిన విధంగా సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇలా కోడెల మరణించడంతో సత్తెనపల్లిలో టీడీపీ వీక్ అయింది. అటు నరసారావుపేటలో చదలవాడ అరవింద్ బాబు ఉన్నా సరే టీడీపీ బలోపేతం కావడం లేదు. ఆ మాటకు వస్తే నరసారావుపేటలో కోడెల ఉండగానే టీడీపీ చేతులు ఎత్తేసింది. మొత్తంగా నాలుగు సార్లుగా అక్కడ కాంగ్రెస్, వైసీపీలే విజయం సాధిస్తున్నాయి.
ఇక సత్తెనపల్లిలో టీడీపీ బాధ్యతలని కోడెల తనయుడు శివరాం చూసుకుంటున్నారు. అయితే కోడెల మాదిరిగా పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండటం లేదు. ఏదో పార్టీ ప్రధాన కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తున్నారు తప్ప, మిగతా సమయాల్లో పార్టీని పట్టించుకోవడం లేదు. పైగా సత్తెనపల్లి సీటుపై కోడెల వారసుడితో పాటు రాయపాటి వారసుడు కూడా కన్నేశారు. చంద్రబాబు ఏదీ తేల్చడం లేదు. పార్టీ కేడర్లో కొందరు కోడెల వారసుడికి, కొందరు రాయపాటి వారసుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే చలపలి ఆంజనేయులు కూడా యాక్టివ్ అయ్యారు. దీంతో సత్తెనపల్లిలో టీడీపీ బలపడటం లేదు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అటు నరసారావుపేటలో టీడీపీది అదే పరిస్థితి. మొత్తానికైతే కోడెల చనిపోయాక నరసారావుపేట, సత్తెనపల్లిలో టీడీపీకి పెద్ద దిక్కున్నదే కరువైపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates