స్టాలినూ… మీరు సూప‌ర్ సామీ

ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (డీఎంకే) చీఫ్ ఎంకే స్టాలిన్… ఆ ప‌ద‌విలో ఉండ‌గా అంత‌గా ఎలివేట్ కాలేదు గానీ… ఎప్పుడైతే త‌మిళ‌నాడు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారో.. త‌న‌లోని ప‌రిణ‌తి చెందిన పొలిటీషియ‌న్ య‌మా స్పీడుగా దూసుకొచ్చేస్తున్నారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాలంటేనే… ప్ర‌త్య‌ర్థిని చిత్తు చేసే ఎత్తులు, జిత్తుల‌కు పెట్టింది పేరు. అలాంటి రాజ‌కీయాల్లోనే ఓన‌మాలు దిద్దుకున్న స్టాలిన్‌… తాను సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే… జ‌నం సంక్షేమాన్ని మాత్ర‌మే చూస్తాను గానీ… రాజ‌కీయ క‌క్ష‌సాధింపుల‌ను ఎంత‌మాత్రం స‌హించేది లేద‌న్న రీతిలో త‌న‌దైన శైలి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

సీఎంగా ప్ర‌మాణం చేసిన రోజే పేద‌ల సంక్షేమానికి సంబంధించి ఐదు సంత‌కాలు చేసిన స్టాలిన్‌… తాజాగా సోమ‌వారం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మిళ‌నాట దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత హ‌యాంలో పేద‌ల‌కు రూ.5లకే భోజనం అందించే ఉద్దేశ్యంతో ‘అమ్మ క్యాంటీన‌’ పేరిట ప్ర‌త్యేకంగా స‌ర్కారీ క్యాంటీన్ల‌ను ఓపెన్ చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఆమె వార‌సులుగా రాష్ట్రాన్ని పాలించిన ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌ణిసామిలు కూడా వీటిని కొన‌సాగించారు. అయితే జ‌య మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన తొలి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ఓట‌మి పాలు కాగా… స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజ‌యం సాధించింది. దీంతో స్టాలిన్ సీఎం ప‌గ్గాలు చేప‌ట్టారు.

సాధార‌ణంగా డీఎంకే కొన‌సాగించిన ప‌థ‌కాల‌కు అన్నాడీఎంకే ర‌ద్దు చేయ‌గా… అన్నాడీఎంకే ప్రారంభించిన ప‌ధ‌కాల‌కు డీఎంకే ర‌ద్దు చేస్తూ సాగాయి. ఈ క్ర‌మంలో అమ్మ క్యాంటీన్ల‌ను స్టాలిన్ స‌ర్కారు ర‌ద్దు చేస్తుంద‌ని అంతా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న స్టాలిన్‌… అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే పేద‌ల ఆక‌లి తీర్చే అమ్మ క్యాంటీన్ల‌ను ర‌ద్దు చేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేశారు. అమ్మా క్యాంటీన్ల‌ను త‌న హ‌యాంలో కూడా కొన‌సాగించ‌నున్న‌ట్లుగా సోమ‌వారం స్టాలిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఒక్క‌సారిగా ఏపీలో టీడీపీ హ‌యాంలో ప్రారంభ‌మైన అన్న క్యాంటీన్ల‌ను జ‌గ‌న్ సీఎం కాగానే ర‌ద్దు చేసిన వైనం ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేసింది. క‌నీసం పొరుగు రాష్ట్ర సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని చూసైనా జ‌గ‌న్ నేర్చుకోవాల‌న్న దిశ‌గా ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.