పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఓడించి మమత బెనర్జీ సాధించిన అఖండ విజయం ప్రతిపక్షాల్లో ఆశలు రేకెత్తిస్తున్నట్లే ఉంది. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని శరద్ పవార్ అభిప్రాయపడుతున్నారు. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడి నాయకత్వంలోని ఎన్డీయేని ఢీకొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా పవార్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లే ఉంది.
ఎన్సీపీ జాతీయ అధికారప్రతినిధి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయేకి బలమైన ప్రత్యామ్నాయం కోసం పవార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పటం ఆసక్తిగా మారింది. ఎన్డీయేకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలన్న మమతబెనర్జీ అభిప్రాయానికి అనుగుణంగానే తమ అధినేత కూడా అడుగలు వేస్తున్నట్లు మాలిక్ చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలను సంఘటితం చేసేందుక పవార్ కొద్ది రోజుల్లోనే అవసరమైన చర్యలు తీసుకుంటారట. ప్రాంతీయ పార్టీలను ఒక తాటి పైకి తీసుకురావటమే ధ్యేయంగా పవర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెప్పారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతునే ఉన్నాయి. అయితే ప్రతిపక్షాల్లోని అనైక్యత వల్లే ప్రయత్నాలు ముందుకు సాగటం లేదు.
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు శరద్ పవార్, మమతబెనర్జీ, మాయాదేవి, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళకు ఢిల్లీలో చక్రం తిప్పాలని బలమైన కోరికుంది. కానీ వీరిలో ఎవరికి కూడా అంత సీన్ లేదు. ఎందుకంటే జాతీయపార్టీ కాంగ్రెస్ పార్టీ సహకారం లేకుండా అది సాధ్యంకాదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నపుడు వీళ్ళెవరికీ ఢిల్లీలో చక్రంతిప్పే అవకాశం రాదు.
కేవలం ఈ కారణంతోనే చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అడుగు ముందుకు పడటంలేదు. ఇపుడు కాంగ్రెస్ బాగా బలహీనపడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ చేతికి ఢిల్లీ పగ్గాలు అప్పగించడానికి ప్రాంతీయపార్టీల అధినేతలు ఎవరు అంగీకరించరు. అలాగని కాంగ్రెస్ పార్టీ సహకారం లేకుండా వీళ్ళ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువే. మరి ఈ పరిస్దితుల్లో శరద్ తన ప్రయత్నాల్లో ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates