రాజకీయాల్లో ఎత్తులు ఎప్పుడూ ఒక్కరికే సొంతం కావు. ప్రత్యర్థులకు కూడా సమయం వస్తుంది. అలాంటి సమయం.. సందర్భం.. ఇప్పుడు టీడీపీ వంతు అయితే.. నాడు ఏ ప్రశ్నలతో అయితే.. కొన్ని ఘటనలను అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారో.. ఇప్పుడు అవే ప్రశ్నలకు.. అవే ఘటనలకు వైసీపీ అధినేత జగన్ .. సమాధానం చెప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. చిత్రంగా అనిపించినా.. రాజకీయాలన్నాక.. ఇంతే!
విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు.. వైసీపీ అధినేతగా.. ప్రతిపక్ష నాయకుడిగా.. జగన్ మూడు విషయాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి తన సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య, రెండు రాష్ట్రానికి ప్రత్యేక హో దా, మూడు పోలవరం పూర్తి. ఈ మూడు విషయాల్లోను జగన్ అప్పట్లో కొన్ని ప్రశ్నలు సంధించారు. వివేకా హత్య కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదని? ఈ హత్య వెనుక చంద్రబాబే ఉన్నారని.. ఆరోపించారు. దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు.
ఇక, ప్రత్యేక హోదా ను ఎందుకు అమ్మేశారని… ప్యాకేజీకి అమ్ముడు పోయారని.. కూడా జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అదేసమయంలో పోలవరాన్ని కేంద్రం కడతానని చెప్పినా.. తానే కాంట్రాక్టర్ల నుంచి తాయిలాల కోసం.. తీసుకున్నారని.. అందుకే ఆలస్యం అవుతోందని.. అంచనాలు పెంచారని కూడా ఎన్నికల సమయంలో ఆరోపించి.. ప్రజల నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. ఆయా ప్రశ్నలతో టీడీపీ ఒకింత ఇరుకున పడిందనే అప్పట్లో వార్తలు వచ్చాయి. చంద్రబాబు కొన్నింటికి సమాధానాలు చెప్పినా.. ప్రత్యేకహోదా.. పోలవరం విషయాల్లో సమాధాన పరచలేకపోయారు.
ఇక, ఇప్పుడు ఇవే అంశాలు.. అవే ప్రశ్నలు.. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీడీపీ నుంచి వైసీపీకి శరాఘాతాల్లా తగులుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా… సొంత బాబాయి కేసును పరిష్కరించుకుని, నిందితులను పట్టుకోవడంలో జగన్ విఫలమయ్యారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. దీనికి వైసీపీ నేతల నుంచి సమాధానం కరువైంది. ఇక, పోలవరానికి పెంచిన అంచనా నిధులను ఒప్పించుకోలేక పోతున్నారనే విమర్శలకు కూడా జగన్ నుంచి ఆన్సర్ లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది.
అదేసమయంలో పాతిక మంది ఎంపీలను ఇస్తే.. హోదా సహా కేంద్రం నుంచి రావాల్సిన అన్నీ తీసుకువస్తానని.. ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ ఇప్పటి వరకు ఎందుకు హోదాను తేలేక పోయారన్న టీడీపీ అధినేత ప్రశ్నకు సైతం వైసీపీ మౌనంగా ఉండిపోయింది. ఇలా.. విషయాలు.. అవే అయినప్పటికీ.. సీన్ మాత్రం రివర్స్ అయి.. జగన్‌కు ముప్పేట సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.