వైఎస్ ను గుర్తు చేసిన షర్మిల

త్వరలో తాను రాజకీయ పార్టీ పెడతానని.. అందుకు సంబంధించిన వివరాల్ని ఖమ్మం సభలో వెల్లడిస్తానని చెప్పిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల అనుకున్నట్లే సభను పూర్తి చేశారు. అనుకోనిరీతిలో.. తాను పెట్టబోయే పార్టీ పేరును ఇప్పుడు కాదని.. వైఎస్ జయంతి రోజున వెల్లడిస్తానని చెప్పి.. మరింత ఉత్కంఠకు తెర తీశారు. తల్లి విజయమ్మతో కలిసి ఖమ్మం సభకు హాజరైన ఆమె ఉత్సాహంగా కనిపించారు.

స్టేజ్ మీదకు వచ్చిన ఆమె.. చేతులు ఊపటం.. రెండు చేతులు జోడించిన అభివాదం చేయటం లాంటి పనులు చేసినప్పుడు.. దివంగత మహానేత వైఎస్ ను గుర్తుకు తెచ్చేలా చేశారని చెప్పాలి. షర్మిల అభివాదం అచ్చుగుద్దినట్లుగా రాజన్న మాదిరే ఉందని అందరు అనుకోవటం కనిపించింది. స్టేజ్ మీదకు వచ్చినంతనే.. వేదిక ముందున్న వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆమె.. వేదిక మొత్తం కలియతిరిగారు.

సభకు వచ్చిన వారందరిని అభివాదం చేశారు. వైఎస్ మాదిరే ఎడమ చేతిని గాల్లో ఊపుతూ సభకు హాజరైన వారిని అభివాదం చేశారు. ఆయన మాదిరే రెండు చేతుల్ని పైకెత్తి అభివాదం చేశారు. వేదిక మీద ఉన్న విజయమ్మ.. కుమార్తెకు ముద్దుపెట్టి.. తన ఆశీస్సుల్ని అందించారు. మొత్తంగా ఖమ్మం సభలో పదే పదే వైఎస్ ను గుర్తుకు తేవటంలో షర్మిల సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.