వీళ్ళద్దరి కాంబినేషన్ పై రాజకీయల్లో చర్చలు మొదలయ్యాయి. ఒకపుడు కొంతకాలం కలిసే ఉన్నారు. తర్వాత విడిపోయారు. మళ్ళీ లోపాయికారీగా కలిసి పనిచేశారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులు పెట్టుకున్న కారణంగా చంద్రబాబునాయుడుకు దూరమయ్యారు. అయితే ఇటీవల జరిగిన పంచాయితి ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ+జనసేన కలిసి పోటీచేశాయి. పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కలవటం సాధ్యంకాలేదు.
ఇలా అవసరం, అవకాశం ఉన్నపుడు కలిసి పనిచేయటం లేకపోతే విడిగా పోటీ చేయటం అన్నది తెలుగుదేశంపార్టీ, జనసేనకు మామూలైపోయింది. అయితే తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఓ విషయం స్పష్టమైపోయింది. అదేమిటంటే జనసేనతో పోల్చుకుంటే మిత్రపక్షం బీజేపీ దేనికీ పనికిరాదని. అలాగే పొత్తులు లేకుండా చంద్రబాబు ఒక్క ఎన్నికలో కూడా ప్రభావం చూపలేడని. ఒంటరిగా పోటి చేసి రెండోసారి చిత్తు చిత్తుగా టీడీపీ ఓడిపోయింది మున్సిపల్ ఎన్నికల్లో.
ఈ నేపధ్యంలోనే పవన్ కల్యాణ్ అటు బీజేపీని వదిలేస్తే ఏమవుతుంది ? అదే సమయంలో చంద్రబాబు, పవన్ పొత్తులు పెట్టుకుంటే ఎలాగుంటుంది ? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే పవన్ కు బీజేపీ ఏమీ ఏ విషయంలో కూడా పెద్ద పీట వేయటంలేదు. అలాగే టీడీపీలో చంద్రబాబు తప్ప గట్టి నేత ఇంకెవరు కనబడటంలేదు. అందుకనే చంద్రబాబు+పవన్ కలవచ్చు కదానే చర్చ పెరుగుతోంది.
ఇప్పటికిప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే బ్రహ్మాండమేదో బద్దలైపోతుందని అనుకునేందుకు లేదు. కానీ మంచి ఫోర్సుగా మారే అవకాశం మాత్రముంది. జనసేనకు అభిమానుల బలం తప్ప ఇంకేమీలేదు. అయితే ఆ అభిమానుల బలాన్ని కూడా పవన్ సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు, శ్రేణులు నీరుగారిపోయున్నారు. టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఏదో వారసునిగా నారా లోకేష్ హైలైట్ అవుతున్నారు కానీ నాయకత్వ లక్షణాలు ఎక్కడా కనబడటంలేదు.
ఈ నేపధ్యంలోనే టీడీపీ+జనసేన పొత్తులు పెట్టుకోవటమో లేకపోతే టీడీపీలో జనసేన విలీనైపోవటమో జరిగితే ఒక్కసారిగా బూస్టప్ వస్తుంది. చంద్రబాబుకన్నా పవన్ కే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటి ఉందన్నది వాస్తవం. కాబట్టి చంద్రబాబు వాస్తవాన్ని గ్రహించి పవన్ను దగ్గరకు తీసుకోవాలి. అప్పుడు చంద్రబాబు వ్యూహాలకు పవన్ పర్యటనలకు టీడీపీ నేతలు, పవన్ అభిమానులు యాడైతే పరిస్ధితి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. మరి లోకేష్ ను పక్కన పెట్టి పార్టీకి పూర్వవైభవం తేవటానికి చంద్రబాబు అంగీకరిస్తారా ?