ప్రచార వేళ.. చీరకట్టులోనూ కబడ్డీ ఆడిన రోజా

పదునైన వ్యాఖ్యలతో రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే పంచ్ లు వేసే ఆర్కే రోజా తరచుగా మీడియాలో నిలుస్తుంటారు. చురుగ్గా.. చలాకీగా ఉండటమే కాదు.. మీడియాలో ఎలా కనపడాలో కూడా తెలుసు. అంబులెన్సు నడిపినా, పాదయాత్ర చేసినా… ఏదో విధంగా మీడియాకు ఎక్కుతారు.

తాజా తనలోని కబడ్డీ క్రీడాకారిణి టాలెంట్ చూపించి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. చీరకట్టులో కబడ్డీ ఆడటానికి మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. అలాంటిది.. కోతకు వెళ్లిన ఆమె.. చురుగ్గా కదిలిన తీరు అందరిని ఆశ్చర్యానికి కలుగజేయటమే కాదు.. వావ్ రోజా.. అనేలా ఆమె వ్యవహరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పురుపోరులో భాగంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లారు నగరి ఎమ్మెల్యే. నగరితో పాటు.. పుత్తూరు మున్సిపాలిటీలో స్థానిక నేతలతో కలిసి వీధి.. వీధి తిరుగుతూ పార్టీ తరఫు ప్రచారం చేస్తున్నారు. వైసీపీకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె.. నిండ్రలోని ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు.

సరదాగా అనుకున్నప్పటికి సీరియస్ గానే ఆడారు రోజా. కోతకు వెళ్లిన ఆమె.. అక్కడి విద్యార్థులకు సమానంగా ఉత్సాహంగా కదిలారు. ఓవైపు కోత పెడుతూనే..ఆటగాళ్లను అవుట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె చురుగ్గా కదిలిన తీరును అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమైనా.. ఇలాంటివి ఆర్కే రోజాకు మాత్రమే సాధ్యమని స్థానికులు ప్రశంసిస్తుండటం విశేషం.