మమత బలం పుంజుకుంటోందా ?

ఇపుడు యావత్ దేశం ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్న ఎన్నికలు పశ్చిమబెంగాల్ దే. తొందరలో జరగబోయే ఎన్నికల్లో విజయంసాధించి హ్యాట్రిక్ కొట్టాలని మమత బెనర్జీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి డైరెక్షన్లో అమిత్ షా చేయని ప్రయత్నంలేదు. ఈ నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు ఒకరిపై మరొకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు.

ప్రభుత్వంలో అస్ధిరపరిచేందుకు బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 29 మంది ఎంఎల్ఏలతో పాటు ముగ్గురు ఎంపిలను, కొందరు సీనియర్ నేతలను కూడా లాగేసుకుంది. ఎక్కడ వీలైతే అక్కడల్లా ప్రభుత్వాన్ని బాగా ఇబ్బందులు పెడుతోంది. ఇందుకోసం గవర్నర్ ను అడ్డంగా ఉపయోగించుకుంటోందంటూ మమత మోడి, షా ధ్వయంపై పెద్ద ఎత్తున మండిపోతోంది.

సరే ఎవరేమి చేసినా అంతిమంగా ఎన్నికల్లో విజయంకోసమే. ఈ నేపధ్యంలోనే ఏబీపీ-సీ వోటర్ సర్వే వచ్చింది. దీంట్లో మమత హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పింది. ఈ నేపధ్యంలోనే మమతకు కలిసొచ్చే డెవలప్మెంట్ ఒకటి జరిగింది. అదేమిటంటే బీహార్ ఆర్జేడీ చీఫ్, యువనేత తేజస్వీ యాదవ్ సంపూర్ణ మద్దతు పలికారు. బెంగాల్లోని బీహారీలందరూ తృణమూల్ కాంగ్రెస్ కే ఓట్లేయాలంటూ పిలుపిచ్చారు. నరేంద్రమోడికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని తేజస్వి చెప్పారు.

చూడబోతే పిలుపివ్వటంతోనే ఆగకుండా బెంగాల్లో మమతకు మద్దతుగా తేజస్వి ప్రచారం కూడా చేసేట్లున్నారు. మొన్నటి బీహార్ ఎన్నికల్లో బీజేపీకి తేజస్వి ముచ్చెమటలు పట్టించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. నరేంద్రమోడి, అమిత్ లాంటి హేమా హేమీలందరిని ఒంటరిగా ఎదుర్కొని ఆర్జేడీని 66 అసెంబ్లీ సీట్లలో గెలిపించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఎన్నికతోనే తేజస్వి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కూటమి గనుక బలం పుంజుకుంటే దాని ప్రభావం కూడా ఎక్కువ బీజేపీ మీదే పడే అవకాశం ఉంది. మొన్ననే ఈ కూటమి నిర్వహించిన బహిరంగసభకు విశేషసంఖ్యలో జనాలు హాజరయ్యారు. దాంతో ఈ కూటమిని అంత తేలిగ్గా తీసేసేందుకు లేదని అర్ధమవుతోంది.

కూటమిలోని అభ్యర్ధులు ఎక్కువమంది గెలవకపోయినా ఇతరుల గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశాలను కొట్టేసేందుకు లేదు. ఇక ముస్లిం ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం పార్టీ ఎలాగూ ఉండనే ఉంది. కాబట్టి క్షేత్రస్ధాయిలోని పరిణామాలను చూస్తుంటే మమతకు గెలుపవకాశాలు పెరుగుతున్నట్లే ఉంది.