తమిళనాట రాజకీయాన్ని మారుస్తానని, ప్రజలకు కొత్త ఆశాజ్యోతిని అవుతానని అంటూ రాజకీయారంగేట్రం చేశారు లోకనాయకుడు కమల్ హాసన్. ఒకప్పుడు తాను రాజకీయాల్లో రానంటే రానని ఖరాఖండిగా చెప్పిన ఆయన.. జయలలిత మరణానంతరం మనసు మార్చుకున్నారు. కరుణానిధి శకం కూడా ముగిసినట్లే అని అర్థం చేసుకుని తమిళనాట నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఆయన రంగంలోకి దిగారు. మక్కల్ నీదిమయం పేరుతో మూడేళ్ల కిందటే ఆయన పార్టీ అనౌన్స్ చేశారు.
రెండేళ్ల కిందట లోక్‌సభ ఎన్నికల్లోనూ తన పార్టీని బరిలో నిలిపారు. అక్కడ ఆశించిన ఫలితాలు రాకపోయినా.. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తూ వచ్చారు. గత కొన్ని నెలలుగా క్షేత్ర స్థాయిలోకి దిగి చాలా సీరియస్‌గా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన విధానాలు నచ్చి కొన్ని పార్టీలు మక్కల్ నీదిమయంతో జట్టు కట్డడానికి ముందుకొచ్చాయి. అందులో ఒకటి.. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి (ఏఐఎస్ఎంకే).
సీనియర్ నటుడు శరత్ కుమార్ కొన్నేళ్ల కిందట మొదలుపెట్టి పార్టీనే ఏఐఎస్ఎంకే. దీంతో పాటుగా ద్రవిడ భావజాలం ఉన్న ఐజేకే అనే మరో పార్టీ కూడా కమల్ పార్టీతో చేతులు కలిపింది. ఈ పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్‌ను ప్రకటించారు. ఈ ప్రకటన చేసింది శరత్ కుమారే కావడం విశేషం.
మరో విశేషం ఏంటంటే.. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ శరత్ కుమార్ పార్టీ తరఫున రాధాపురం అనే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు శరత్ వెల్లడించాడు. అలాగే తన భార్య, పార్టీ ప్రధాన కార్యదర్శి రాధిక.. కోవిల్‌పట్టి నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తుందన్నారు. తమ కూటమి ఇంకా ఇంకా బలపడుతుందని, ఎన్నికల్లో ఎంతో ప్రభావం చూపిస్తుందని, మంచి ఫలితాలు రాబడుతుందని శరత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాట ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రధానంగా డీఎంకే-కాంగ్రెస్, అన్నాడీఎంకే మధ్య పోటీ నెలకొంది. డీఎంకే-కాంగ్రెస్ కూటమికే విజయావకాశాలు ఎక్కువని రాజకీయ పండితులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates