అదేంటి? టీడీపీ కోసం వైసీపీ అధినేత జగన్ త్యాగం చేయడమేంటి? టీడీపీ అంటేనే నిప్పులు తొక్కుతా రు కదా! అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మజా! అయితే.. ఇది.. టీడీపీని అణగదొక్కేందు కు జగన్ చేస్తున్న త్యాగం. బలమైన నేతను సైతం… టీడీపీకి చెక్ పెట్టేందుకు త్యాగం చేస్తున్నారట.
విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకుడిగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. కాపు నాయకుడుగా కూడా.. పార్టీ తరఫున బలమైన గళం వినిపిస్తున్నారు. పార్టీలో చేరింది. ఎన్నికలకు ముందే అయినా.. సీనియర్ల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు.
దీంతో జగన్.. ఆమంచికి మంచి మార్కేలేసి.. కీలక నేతగా గుర్తించారు. అయితే.. గత ఎన్నికల్లో ఆమంచి అనూహ్యమైన ఓటమి పొందారు. చీరాల నుంచి టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు కరణం బలరాం విజయం సాధించారు. అయితే.. ఏడాది లోపే కరణం.. తన కుమారుడు వెంకటేష్ ను వైసీపీలో చేర్చారు. ఈ క్రమంలోనే తాను కూడా టీడీపీకి డిస్టెన్స్ పాటిస్తూ.. వైసీపీకి మద్దతు దారుగా ఉన్నారు. దీంతో చీరాల వైసీపీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. తరచుగా కరణం వర్సెస్ ఆమంచి వర్గాల మధ్య వివాదం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో.. ఇరు పక్షాలు పోలీసు కేసులు కూడా పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చీరాల ను కరణం కు వదిలి పెట్టి.. ఆమంచిని పరుచూరు నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా పంపాలని నిర్ణయించుకున్నారు. అయితే.. దీనికి ఆమంచి ససేమిరా అంటున్నారు. చీరాలను వదిలి పెట్టేది లేదని అన్నారు. ఈ క్రమంలోనే జగన్.. ఆమంచిని సర్ది చెప్పి.. కరణంను వదులుకుంటే.. బలమైన టీడీపీ నేత మనకు దూరమవుతారని.. వచ్చే ఎన్నికల్లో కరణం ద్వారా ప్రకాశం టీడీపీకి చెక్ పెట్టేద్దామని.. జగన్ భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్ ద్వారా.. ఆమంచికి కబురు పంపినట్టు తెలిసింది. అంతేకాదు.. పరుచూరు వెళ్లేందుకు ఓకే అంటే.. ఆమంచికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సిద్ధమేనని జగన్ కబురు పంపారట. ప్రస్తుతం ఈ విషయమే.. వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమంచికి ఎలాంటి పదవీ లేకుండా పోయింది. ఫలితంగా కేడర్‌లోనూ నిరుత్సాహం గూడుకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏదైనా పదవి కోసం ఆమంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా.. కొంత మేరకు ఉపశమనం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా త్యాగం చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.