జోరు వ‌ర్షం.. వ‌డ‌గండ్ల వాన‌.. అయినా మందు కోసం

రెండు రోజుల నుంచి క‌రోనా వార్త‌ల గురించి పెద్ద‌గా చ‌ర్చ లేదు దేశంలో. సోమ‌వారం ఉద‌యం మ‌ద్యం దుకాణాలు మ‌ళ్లీ తెరుచుకున్న‌ప్ప‌టి నుంచి వాటి గురించే చ‌ర్చ న‌డుస్తోంది. ఎక్క‌డ ఎలా మ‌ద్యం కోసం ఎగ‌బ‌డుతున్నారు.. ఏ రాష్ట్రంలో ఎంత సేల్స్.. ఏ ప్ర‌భుత్వానికి ఎంత ఆదాయం వ‌చ్చింది.. రేట్లెలా ఉన్నాయి.. ఇలాంటి స‌మ‌యంలో మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డమేంటి.. అనే అంశాల గురించి జ‌నాలు విప‌రీతంగా చ‌ర్చించుకుంటున్నారు. బుధ‌వారం తెలంగాణ‌లో మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డం.. ఏపీ అనుభ‌వాల నేప‌థ్యంలో ఇక్క‌డ క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేయ‌డం, సోష‌ల్ డిస్ట‌న్స్ పాటిస్తూ మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌ప‌డం గురించి మీడియాలో పెద్ద ఎత్తునే వార్త‌లొస్తున్నాయి. మందుబాబుల క్ర‌మ‌శిక్ష‌ణ‌, క‌మిట్మెంట్ గురించి కూడా పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

ఇలాంటి స‌మ‌యంలోనే ఓ ఆస‌క్తిక‌ర వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చే్స్తోంది. ఓవైపు భారీ వ‌ర్షం కురుస్తూ వ‌డ‌గ‌ళ్లు కూడా ప‌డుతున్న‌ప్ప‌టికీ.. ఏమాత్రం చ‌లించ‌కుండా మ‌ద్యం దుకాణాల ముందు మందుబాబులు నిల‌బ‌డ్డ వీడియో అది. గొడుగులు ప‌ట్టుకుని సోష‌ల్ డిస్ట‌న్స్ పాటిస్తూ మ‌ద్యం కోసం జోరు వ‌ర్షాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ న‌గ‌రంలో క‌నిపించిన దృశ్యాలివి. గొడుగులు చిరిగిపోయే స్థాయిలో అక్క‌డ వ‌డ‌గ‌ళ్ల వాన ప‌డింది. అయినా స‌రే.. లైన్ త‌ప్పితే మ‌ళ్లీ ఎంతసేపు వెయిట్ చేయాల్సి వ‌స్తుందో అన్న‌ట్లుగా మందుబాబులు అలాగే నిల‌బ‌డ్డారు. మ‌ద్యం కోసం జ‌నాలు ఎంత‌గా త‌పిస్తున్నారో చెప్ప‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా ఇంకా ప‌లు చోట్ల ఇలా వ‌ర్షం ప‌డింది. చాలాచోట్ల జ‌నాలు అలాగే లైన్ల‌లో నిల‌బ‌డి మ‌ద్యం బాటిళ్లు సంపాదించాకే అక్క‌డి నుంచి క‌దిలారు.