కాపులు యాచించే స్ధాయి నుండి శాసించే స్ధాయికి ఎదగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపినిచ్చారు. కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పవన్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర జనాభాలో 27 శాతం కలిగుండి కూడా ఇంకా రాజకీయ నేతలను పదవుల కోసం బతిమలాడుకోవటం ఏమిటి నాన్ సెన్స్ అంటూ ఊగిపోయారు. పవన్ చెప్పింది ఒక విధంగా నిజమే అయితే ఈ పరిస్ధితి ఎందుకొచ్చింది ?
నిజానికి రాష్ట్ర జనాభాలో బీసీల తర్వాత కాపులదే అతిపెద్ద సంఖ్య. అయితే ఇటు బీసీలకు అటు కాపులకు కూడా ప్రత్యేకమైన ఐడెంటి లేకుండాపోయింది. బీసీల సంగతి వదిలిపెట్టేసినా కాపులను మాత్రం ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నం ఒకటి రెండుసార్లు జరిగినా ఫెయిలైంది. ప్రయత్నాలు ఎందుకు ఫెయిలైందంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు.
వంగవీటి రంగా చనిపోయిన తర్వాత కాపుల్లో ఐకమత్యం అవసరమని కొందరు పెద్దలు గుర్తించారు. దాంతో మిరియాల వెంకట్రావు లాంటి నేతలు కాపులను సంఘటితపరచాలని, ప్రత్యేకంగా రాజకీయపార్టీ ఉంటే బాగుంటుందని ప్రయత్నించారు. అయితే సాధ్యంకాలేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కాపుల్లో ఐకమత్యం లేకపోవటమే అని అందరికీ తెలిసిందే. అయితే ఆ ఐకమత్యం తేవటానికి ఏమి చేయాలో తెలీకే ఆ ప్రయత్నాన్ని వదలిపెట్టేశారు.
తర్వాత చాలాకాలానికి చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టి కాపులను ఏకం చేద్దామని ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫెయిలైంది. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉండుంటే ఏమి జరిగిదో. ఎప్పుడైతే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తనదారి తాను చూసుకున్నారో అప్పుడే కాపుల్లో చిరంజీవి మీద నమ్మకం పోయింది. ఆ దెబ్బే ప్రస్తుతం పవన్ కల్యాణ్ మీద కనబడుతోంది.
నిజానికి కులం ఆధారంగా పార్టీ పెట్టి సక్సెస్ అయ్యేంత పరిస్ధితులు ఉత్తరాధి రాష్ట్రాల్లో ఉన్నట్లు దక్షిణాది రాష్ట్రాల్లో లేదు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో అసలు కనబడదు. ఈ కారణంగానే బీసీలైనా కాపులైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాయి. ఈ విషయం తెలుసుగనుకే బీసీ, కాపు నేతలు ఏదో పార్టీల్లో సర్దుబాటు చేసుకుని ప్రయాణం చేస్తున్నారు. మరి పవన్ ఈ లోటును భర్తీ చేస్తారా? మళ్ళీ ఓ ప్రయత్నం చేస్తారా? చూద్దాం ఏమి జరుగుతుందో?