రాను రాను పద్మ పురస్కారాలకు విలువ తగ్గిపోతోందా ? జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పద్మ పురస్కారాలు అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటివి ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులైన వారికి, పర్టిక్యులర్ రంగంలో విశేషంగా సేవలు చేసిన వారికి దక్కాల్సిన పురస్కారాలు. నిజానికి ఈ పురస్కారాలను ప్రారంభించింది కూడా ఇదే స్పూర్తితో. కానీ రాను రాను ప్రభుత్వ పెద్దల ప్రాపకం ఉంటే చాలు పురస్కారాలు దక్కుతాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. గతంలో ఇటువంటి పురస్కారాలను అందుకున్న వారిపై ఎంతటి నిరసనలు వచ్చాయో అందరికీ తెలిసిందే.
కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాలపైన కూడా ఇలాంటి ఆరోపణలే మొదలయ్యాయి. పద్మవిభూషణ్ అందుకున్న అనేకమందిలో రాజకీయనేతలు కూడా ఉండటమే ఈ ఆరోపణలకు కారణమవుతోంది. కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్, సుమిత్రా మహాజన్, కేశూభాయ్ పటేల్, తరుణ్ గొగోయ్, జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే లాంటి వాళ్ళకు పురస్కారాలు అందుకనే జాబితాలోఉన్నారు.
నిజానికి రామ్ విలాస్ పాశ్వాన్, తరుణ్ గొగోయ్, సుమిత్రా మహాజన్ లాంటి వాళ్ళ అచ్చమైన రాజకీయనేతలు. రాజకీయాల్లో వీళ్ళు చేసిన విశేషమైన సేవలంటు పెద్దగా ఏమీ లేవు. రాం విలాస్ చనిపోయేనాటికి ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు. ఇక కేశూభాయ్ పటేల్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. తరుణ్ గొగోయ్ అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా కూడా కేవలం తన ఉద్యోగ నిర్వహణ మాత్రమే చేశారంతే.
ఇక జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేకి పద్మవిభూషణ్ పురస్కారం ఎందుకిచ్చారో ఎవరీ తెలీదు. సుమిత్రా మహాజన్ లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. బీజేపీ నుండి పలుమార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. బతికున్నంత కాలం గొగోయ్, పాశ్వాన్, కేశూభాయ్ లాంటివాళ్ళు అచ్చంగా రాజకీయాల్లో మాత్రమే ఉన్నారు. రాజకీయ రంగానికి వీళ్ళు చేసిన ప్రత్యేక సేవలంటు ఏమీ లేవనే చెప్పాలి. సుమిత్రకు పద్మ పురస్కారం ఎందుకిచ్చారో కేంద్రప్రభుత్వమైనా సమర్ధించుకుంటుందో లేదో తెలీదు. ఇలాంటి వాళ్ళని పురస్కారాలకు ఎంపిక చేయటం వల్లే పురస్కారాలకు రాజకీయ వాసనలు కొడుతున్నాయి.