కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని ఓ సామాన్య కార్యకర్త జగన్ కు లేఖ రాయడం ఆ పార్టీలో దుమారం రేపుతోంది. వివేకానంద రెడ్డి హత్య కేసు కావొచ్చు, ఇతరా వ్యవహారాలు కావొచ్చు జగన్ హయాంలో వైఎస్ కుటుంబానికి గడ్డు రోజులు మొదలయ్యాయని ఇటీవల కాలంలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లో కడప జిల్లాలో కూడా వైసీపీ చిత్తుగా ఓటమి పాలవడం వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
పార్టీ దుస్థితికి కారణంపై నిస్పక్షపాత చర్చ జరగాల్సిన అవసరం వుందని లోలోపల కొందరు మధనపడుతున్నారు. పిల్లి మెడలో ఎవరు గంట కడతారని ఎదురుచూస్తున్న తరుణంలో ఊటుకూరు సుబ్బరామయ్య అనే ఒక కార్యకర్త ఆ పని చేశాడు. వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ కో వల్లే పార్టీ నాశనం అయిపోతుందని సుబ్బరామయ్య కుండబద్దలు కొట్టారు.
సుబ్బరామయ్య రాసిన లేఖలో పార్టీ దుస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించారు. మా గుండెల్లో కొలువై ఉన్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని మొదలుపెట్టి ఆ మహానేత చూపించిన బాటలో మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నడిచాం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాం. రాశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్ మమ్మల్ని నడిపిస్తారని అనుకున్నాం. పార్టీ కోసం శ్రమించాం. కానీ కడప జిల్లాలో పార్టీకి పట్టిన గతి చూస్తే గుండెలు పగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు కడప జిల్లా, పులివెందుల బాధ్యతలను వివేకానంద రెడ్డి చూసుకునేవారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చిన సరే ఆయన ధైర్యం చెప్పేవారు. ఇప్పుడా భరోసా లేకుండా పోయింది. జిల్లా వ్యవహారాలను వివేకానంద రెడ్డితో పాటుగా షర్మిల చూసుకునేవారు. కార్యకర్తలతో సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు షర్మిల మాట్లాడేవారు. ఇప్పుడు అస్సలు మాట్లాడేవారే లేకుండా పోయారు. స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న అవినాష్ రెడ్డి కార్యకర్తలను, వైఎస్ అభిమానులను పట్టించుకోవడం మానేశారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
అవినాష్ తీరుతోనే మున్సిపల్, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవలసి వచ్చిందని, భారీగా మెజారిటీగా వచ్చే మండలాలలో కూడా ఓటు బ్యాంకు చెల్లా చెదురై పోయిందని వాపోయాడు. అవినాష్ రెడ్డి తనకు తొత్తులుగా ఉన్న వారికోసం పులివెందుల నుంచి మొదలుకొని కమలాపురం నియోజకవర్గం వరకు మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్ అభిమానులను పూర్తిగా దెబ్బ తీసాడని వివరించారు.
ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసులో వేల్లన్నీ అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. దీని ప్రభావంతో 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ మీద పడింది. అధికారం కోల్పోయి రెండున్నరేళ్లయ్యింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అదే ప్రభావం కొనసాగింది. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు 2029 ఎన్నికల్లో కూడా వైసీపీకి ఓటమి తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయినా సరే జగన్ కు తెలిసి రావట్లేదని వైసీపీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates