వైసీపీ హయాంలో స్థానిక సంస్థలు జరిగిన తీరును వైసీపీ నేతలు మరిచిపోయినా…ఏపీ ప్రజలు మర్చిపోరు. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా గదిలో పెట్టి తాళాలు వేయడం మొదలు..నామినేషన్ పత్రాలు చించివేయడం వరకు జనాలకు అంతా గుర్తుంది. కానీ, జగన్ మాత్రం తనకేం తెలీదు అన్నట్లు ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని పులివెందుల ఆర్వో ఆఫీసు ముందు అమాయకుడిలా కూర్చున్నారు. అయితే, తమ పార్టీ నేతలు అంత అమాయకులు కాదని అంబటి రాంబాబు సెలవిచ్చారు.
గత ఎన్నికల్లో తాము అక్రమాలకు పాల్పడ్డాం కాబట్టే ఇప్పుడు తమకీ గతి పట్టిందని అంబటి అంగీకరించారు. గత ఎన్నికల్లో తాము చేసిన దాని వల్లే ఈ ఎన్నికల్లో తమకీ గతి పట్టిందని ఒప్పుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, భవిష్యతులో ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. అంటే, 2029లో ఒకవేళ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ తర్వాత ఇంతకన్నా దారుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అంబటి పరోక్షంగా ఇప్పుడే వార్నింగ్ ఇచ్చారు.
మద్యం రవాణా కేసులో ఈడీ విచారణకు హాజరైన అంబటిని మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. గత ఎన్నికల్లో మీరు అక్రమాలకు పాల్పడ్డారు కదా అని వారు ప్రశ్నించగా..అంబటి అవునని నిర్భయంగా తాము అక్రమాలు చేశామని చెప్పుకోవడం గమనార్హం. కర్మ సిద్ధాంతాన్ని అంబటి, వైసీపీ నేతలు పెద్దగా నమ్మినట్లు కనిపించడం లేదు. ఆ మాటకొస్తే అది అన్ని పార్టీలకు, వ్యక్తులకు వర్తిస్తుంది. అయితే, ఈ విష సంస్కృతిని ఎవరు మొదలుబెట్టారు? వారు గతంలో ఏ స్థాయిలో అరాచకం చేస్తే ప్రత్యర్థులు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న విషయాన్ని అంబటి గ్రహించాలి.
ఇక, మద్యం రవాణా కేసులో ఈడీ అధికారులకు అంబటి షాకింగ్ జవాబిచ్చారు. వైసీపీ నేతలు పురుషోత్తం, సుబ్బారెడ్డి మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ కోసం తన దగ్గరకు వచ్చారని చెప్పారు. వారికి సబ్ కాంట్రాక్ట్ కోసం తాను సిఫారసు చేసిన మాట వాస్తవమని అంగీకరించారు. తన దగ్గరకు వచ్చిన వారికి నో చెప్పనని, తనకు చేతనైన స్థాయిలో సిఫారసు చేస్తానని కూడా అంబటి అన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates