సీఎంను విమర్శిస్తే కేసులా.. పోలీసులకు హైకోర్టు క్లాస్!

అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేసినందుకు కేసులు పెట్టడం, అరెస్టులకు సిద్ధపడటం వంటి వ్యవహారాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రిని విమర్శించడం నేరం కాదని స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు విమర్శలను ఎదుర్కోవాల్సిందేనని పేర్కొంది. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా కాకుండా ప్రజలందరికీ సమానంగా పనిచేయాలని సూచించింది. తమిళనాడులో ఓ మహిళా నేతపై నమోదైన కేసును విచారిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడులో డీఎంకే మహిళా నేత, చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్ సుధా అక్టోబర్ 7న జరిగిన ఓ కార్యక్రమంలో టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీవీకే నేత ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 19న పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసే అవకాశం ఉండటంతో సుధా ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎన్.రమేశ్ పోలీసుల తీరును తప్పుబట్టారు. వ్యాఖ్యలు చేసిన తర్వాత 12 రోజులపాటు ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయాల్సిన అవసరాన్ని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి, అధికార పార్టీ నేతలపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు పోలీసులపై ఉన్నాయని ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి విమర్శలను భరించలేనంత బలహీనంగా ఉండరని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయాల్లో విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు సాధారణమని పేర్కొంది. పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రతి విమర్శను శాంతిభద్రతల సమస్యగా చూడకూడదని తెలిపింది. అయితే సుధా ఉపయోగించిన అనుచిత పదజాలాన్ని కూడా న్యాయస్థానం సమర్థించలేదు.

చివరకు సుధాకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల బాండ్‌తో పాటు ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు పోలీసుల ఎదుట హాజరుకావాలని సూచించింది. ఇకపై రాజకీయ విమర్శలు చేయకూడదనే షరతు విధించేందుకు మాత్రం నిరాకరించింది. అలాంటి ఆంక్ష భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని స్పష్టం చేసింది.