పెద్దిరెడ్డి పరువు పోయిందిగా!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డికి భారీ షాక్ త‌గిలింది. స్థానిక ఎన్నిక‌ల్లో 36 వార్డుల‌కు గాను.. 32 చోట్ల ఇప్ప‌టికే ఏక‌గ్రీవాలు జ‌రిగాయి. దీంతో అస‌లు ఎన్నిక‌ల్లోనే పోటీ చేయ‌బోమ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. కానీ.. ఏక‌గ్రీవాలు పోగా.. మిగిలిన నాలుగు స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. వీటిలో వైసీపీ నాయ‌కులు పోటీ చేశారు. నామినేష‌న్ల ప‌ర్వం కూడా ఈ నాలుగు స్థానాల్లో బాగానే సాగింది.

అయితే.. తాజా ఫ‌లితాల్లో పుంగ‌నూరులో పోలింగ్ జ‌రిగిన నాలుగు వార్డుల్లోనూ టీడీపీ 3, తెలుగు దేశం స‌హ‌కారంతో సీపీఐ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దీంతో పుంగ‌నూరు వ్యాప్తంగా కూట‌మిదే ప్ర‌భంజ‌నం క‌నిపించింది. వాస్త‌వానికి 2021లో ఈ పుంగ‌నూరు మునిసిప‌ల్ స్థానాన్ని వైసీపీ గుండ‌గుత్త‌గా కైవసం చేసుకుంది. ఒక్క పార్టీ త‌ర‌ఫున కూడా నామినేష‌న్ వేయ‌కుండా అడ్డుకున్నార‌న్న వార్త‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే.. తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థులు కూడా ఏక‌గ్రీవాలు చేసుకున్నా.. నాలుగు చోట్ల జ‌రిగిన ప్ర‌జ‌ల ఓటింగ్‌లో కూడా వైసీపీ ప‌రాజ‌యం పాలైంది.

ఇక‌, ఏ పార్టీకి ఎంత అనే విష‌యానికి వ‌స్తే.. పుంగ‌నూరులోని మొత్తం 36 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ (TDP): 30, జనసేన పార్టీ (JSP): 02 వార్డులు, భారతీయ జనతా పార్టీ (BJP): 02 వార్డులు, సీపీఐ: 01 వార్డు, స్వతంత్ర అభ్యర్థి 1 వార్డును సొంతం చేసుకున్నారు. దీంతో వైసీపీ అడ్ర‌స్ లేకుండా పోయింద‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు. ఇదే హ‌వా అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ చూపిస్తామ‌ని అంటున్నారు. గెలుపొందిన అభ్య‌ర్థులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

పెద్దిరెడ్డి ఆఫీసుకు తాళం..

పుంగ‌నూరులోని సెంట‌ర్ లో ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆఫీసుకు తాళం క‌నిపించడం గ‌మ‌నార్హం. నిజానికి ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో పెద్దిరెడ్డి ఆఫీసుకు వ‌స్తార‌ని.. పార్టీనాయ‌కులు గుమిగూడారు. వేచి చూశారు. కానీ, ఆయ‌న ఎంత‌కి రాక‌పోగా.. వేసిన తాళం కూడా తీయ‌క‌పోవ‌డం.. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. ఆఫీసు నుంచి వెనుదిరిగారు. మ‌రోవైపు.. ఏక్ష‌ణంలో అయినా.. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావించిన పోలీసులు.. పెద్దిరెడ్డి కార్యాల‌యం ముందు ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.