రాప్తాడు జడ్పీ హైస్కూల్లో ఓ బాలికపై ఒక ఉన్మాది పాశవికంగా దాడి చేసిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ సైకో దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలికకు బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ బాలికను, కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు.
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి ఊర్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు, గంజాయి అందుబాటులోకి వచ్చాయని, వాటికి బానిసలైన యువత ఈ రకమైన ఉన్మాదపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. లిక్కర్, గంజాయి మత్తులో అనేక నేరాలు, అరిష్టాలు జరుగుతున్నాయని, అందులో ఇది ఒకటని అన్నారు. ఆ దాడి ఘటన ప్రభుత్వ తప్పిదం అని, జడ్పీ హైస్కూల్లోకి వచ్చి ఆడపిల్లల మీద రంపంతో దాడి చేస్తే పాఠశాలల్లో చదివే పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
అంతేకాదు, బాధిత బాలిక కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, వైద్యపరంగా అన్ని రకాలుగా అండగా ఉండాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని, వైద్య పరంగా అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వకుంటే…తమ ప్రభుత్వం వచ్చిన నెల తర్వాత ఆ యాభై లక్షలు ఇస్తామని జగన్ ప్రకటించారు.
బాధిత బాలిక పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారని, ఆపరేషన్ విజయవంతం అయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అయితే, మరో 48 గంటలు క్రిటికల్ అని డాక్లర్లు చెబుతున్నారని, దీంతో, కొంత ఆందోళనగా కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత బాలిక పూర్తిగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates