మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం అర్ధరాత్రి దాటాక కూడా అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉండి.. సమీక్షలు నిర్వహించారు. నిజానికి ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో ఒకవైపు ఆ విషయాలను పరిశీలిస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందనే సూచనలను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు, జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకుని వాటిపైనా దృష్టి సారించారు.
ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకునే పనిలో పడ్డారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయ్, డీకే శివకుమార్ లతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బందిని, యంత్రాలను పంపాలని రెండు రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు. దీనిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. ఏపీకి అవసరమైన మేరకు సహకరిస్తామని తెలిపారు. ఇప్పటికే అర్నబ్ తుఫాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించే పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నారు.
మరోవైపు అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్దరణ పనులను ముగించుకున్న పలువురు విద్యుత్ శాఖ సిబ్బందిని ముందు జాగ్రత్తగా మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉంచింది. ఇక, రాష్ట్రంపై మురసు తుఫాను ప్రభావం, వర్షాలు, గాలుల అంచనాలు, జలాశయాల పరిస్థితిపై ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజల పరిస్థితులు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వివరాలను తెలుసుకుని పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీ పర్యటన రద్దు..
ముందస్తు షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీలో పర్యటించాల్సి ఉంది. పునరుత్పాదక ఇంధన సదస్సుకు ఆయన హాజరై.. ఏపీలో చేపడుతున్న పనులను వివరించి పెట్టుబడులకు మార్గాన్ని సుగమం చేయాలని భావించారు. అయితే, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనను కూడా సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సోమవారం కూడాపూర్తిస్థాయిలో తుఫాను ప్రభావంపైనే సీఎం చంద్రబాబు దృష్టి సారించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates