మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలవడం.. మేయర్ పదవి మీద గురి పెట్టడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆయనకంటూ ఒక పార్టీ లేకపోయినా.. కార్పొరేటర్ల మద్దతు దొరికే అవకాశం లేకపోయినా.. నేరుగా మేయర్ పదవిని లక్ష్యంగా చేసుకోవడం విడ్డూరంగానే అనిపిస్తోంది. ఏబీవీకి జనాల్లో మంచి పేరే ఉన్నప్పటికీ.. ఆయన్ని టీడీపీ ప్రో అఫీషియల్‌గానే చూస్తూ వచ్చారు ఇంతకాలం.
ఐతే ఆయన ఇటీవల కూటమి ప్రభుత్వం మీదే విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన్ని ఎలా టార్గెట్ చేశారో, అకారణంగా సస్పెండ్ చేసి ఎంతగా వేదనకు గురి చేశారో గుర్తుండే ఉంటుంది. కోర్టులో అలుపెరగని పోరాటం చేసి తన మీద సస్పెన్షన్ తొలగిపోయేలా చేసుకున్నారు. ఇంతలోనే ఆయన రిటైరైపోయారు కూడా.
టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆయన సేవలను ఉపయోగించుకుంటుందని, ఏదో పదవి ఇస్తుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తూ విజిల్ బ్లోయర్ పాత్ర పోషించే ప్రయత్నం చేశారాయన.
ఇంతలోనే ఏబీవీ చూపు రాజకీయాల వైపు తిరిగింది. ఐతే రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడు ముందు ఆయన టీడీపీ వైపే చూశారట. ఆ పార్టీలో చేరతానంటూ తాను టీడీపీ నాయకులకు చెప్పినట్లు ఏబీవీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఐతే అటు నుంచి ఆశించిన స్పందన రాలేదన్నారు. నారా చంద్రబాబు నాయుడికి బ్యూరోకాట్లు అంటే ఇష్టమే కదా, రాజకీయాల్లో వారిని బాగానే ప్రోత్సహిస్తారు కదా అంటే..
ఆయనకేమైనా చేదు అనుభవాలున్నాయేమో తెలియదు, నేను పార్టీలోకి వస్తే తప్పుల మీద ప్రశ్నిస్తానేమో.. లేని పోని తలనొప్పులు ఎందుకు అనుకున్నారేమో తెలియదు అని వ్యాఖ్యానించారు ఏబీవీ. మొత్తానికి టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నించినా, అక్కడి నుంచి సానుకూల స్పందన రాని నేపథ్యంలోనే ఏబీవీ.. ఇప్పుడు స్వతంత్రంగా పోటీకి దిగి కూటమి ప్రభుత్వం, టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారంటూ ఆయన మీద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates