తీహార్ జైలుకు బొద్దింకలు

కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఎన్నికల సంస్కరణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వీరు చేపట్టిన నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం.. వీరిపై కేసు న‌మోదు చేశారు. తాజాగా బుధ‌వారం కోర్టు వీరికి రిమాండ్ విధించింది. అనంత‌రం.. వారిని తీహార్ జైలుకు తరలించారు.

ఇదీ.. రీజ‌న్‌..

కాక్రోచ్ జ‌నతాపార్టీ.. ఇటీవ‌ల కాలంలో నీట్ స‌హా.. సీఈసీకి వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్‌ను వేదిక‌గా చేసుకుంటున్నారు. అయితే.. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను నిరసనల జాబితా నుండి తొలగించారు. అంతేకాదు.. ఉల్లంఘించిన వారిపై కేసులు పెడ‌తామ‌నికూడా పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ, సీజేపీ నేతలు అక్కడి బారికేడ్లు, గేట్లను దాటుకుని లోపలికి ప్రవేశించారు. దీంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధించిన ఆంక్షలను ఉల్లంఘించి, అనుమతి లేకుండా నిరసన తెలపడం, చొరబాటుకు పాల్పడటం వంటి ఆరోపణలపై పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

ఈ అరెస్టులు, జైలు విధింపుపై సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తమ గొంతు నొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని మండిప‌డ్డారు. దేశంలో “అనధికారిక ఎమర్జెన్సీ”ని అమలు చేయడానికి ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని దీప్కే తీవ్రంగా మండిపడ్డారు. అయిన‌ప్ప‌టికీ.. త‌మ ఉద్య‌మం ఆగ‌బోద‌ని.. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణకు ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొంటామ‌ని తేల్చి చెప్పారు. త‌మ‌కు రాజ‌కీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేద‌ని పేర్కొన్నారు.

మ‌రోవైపు సీజేపీకి కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదన్నారు. దేశ యువతను ఇలా జైలుకు పంపడం కేంద్ర ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీజేపీ నేత‌ల అరెస్టులను ఖండించారు. తాము సీజేపీకి అండ‌గా ఉంటామ‌ని చెప్పారు.