తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో జరుగుతున్న ‘విజయవాడ ఉత్సవ్’లో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో తన స్పీచ్ తో విజయ్ అదరగొట్టారు. ఇక్కడి ప్రజలను కలవడం సంతోషంగా ఉందని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
నదుల అనుసంధానం గురించి సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు విజయవాడ వచ్చానని తెలిపారు. తనను ఈ ఉత్సవాలకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తనను ఇంతగా అభిమానించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తమిళంలో మాట్లాడి తన స్పీచ్ ను ఆయన ముగించారు. విజయ్ మాట్లాడుతున్నంతసేపు యువకులు, ఆయన అభిమానులు కేకలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం విజయ్ స్పీచ్ నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతకుముందు, విజయవాడలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని విజయ్ దర్శించుకున్నారు. సీఎం విజయ్ కు ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. జగన్మాతకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలను విజయ్ కు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అందజేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates