తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ ఊహించని విధంగా సైలెంట్ గా వచ్చి తమిళనాడు పగ్గాలు చేపట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎగిరిపడకుండా ఒదిగివుంటూ అంతే సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు దక్షిణాది ముఖ్యమంత్రుల్లో ఇండియా కూటమి తరపున కీ రోల్ పోషిస్తున్న విజయ్, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు విజయదశమి పండుగను పురస్కరించుకొని విజయవాడకు వచ్చారు.
మంగళవారం దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అన్నపూర్ణా దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వేదాశీర్వచనం అందించిన వేద పండితులు దుర్గమ్మ ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
తమిళ తంబీలు ముద్దుగా దళపతి అని పిలుచుకొనే విజయ్ కు తెలుగు నాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిట్ చిత్రాల రీమేక్ సినిమాల్లో హీరోగా నటించి తెలుగు వారికి దగ్గరయ్యారు. దాంతో గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈలలు, కేకలతో విమానాశ్రాయం పరిసరాలు దద్దరిల్లాయి.
ఈ ఏడాది మొదట్లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్ర పటం ప్రదర్శించిన సంగతి తీసిందే. అంతకుముందు చెన్నైలో జరిగిన జగన్ బాబాయ్ వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు విజయ్ హాజరయ్యారు. అప్పుడు వీరిద్దరూ చాలా సేపు చర్చించుకోవడం కనిపించింది. విజయ్ చుట్టూ జగన్ సన్నిహితులు వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలో విజయ్ విజయవాడ పర్యటనకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏలో కీలకంగా వున్నారు. విజయ్ ఇండియా కూటమిలో వున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కలయికలో కేవలం పరిపాలనా పరమైన అంశాలు మాత్రమే చర్చించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేనా… అంతకంటే ఇంకేమైనా ఉందాని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద తమిళనాడు సీఎం విజయ్ అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబును కలవడం జగన్ అండ్ కో జీర్ణించుకోలేక పోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates