వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా ఆయన సతీసమేతంగా కుటుంబంతో సహా విదేశాల్లో పర్యటించి రావాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి సిబిఐ కోర్టు నుంచి కూడా ఆయన అనుమతులు తెచ్చుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ పర్యటనకు సంబంధించి బ్రేక్ పడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున సొంత పార్టీ వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తెలంగాణ లోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. జగన్ పై నమోదైన అక్రమ ఆస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని రోజువారీగా విచారణ జరపాలని ఆ పిటిషన్ లో కోర్టును అభ్యర్థించారు. అంతేకాదు జగన్ను కోర్టుకు పిలవాల్సిందేనని కూడా పిటిషన్ లో స్పష్టం చేశారు. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాల కట్టడికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు చెప్పిన దరిమిలా జగన్ పై నమోదైన కేసుల విచారణ వడివడిగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ను కోర్టుకు పిలవడంతో పాటు ఆయనపై నమోదైన కేసులను మరింత వేగంగా పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు. దీనిపై న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం ఆధారంగానే జగన్ విదేశీ పర్యటన ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
ఒకవేళ రోజువారీ విచారణ ప్రారంభించి జగన్ పై నమోదైన కేసులను తేల్చేయాలని గనుక తీర్పు ఇస్తే ఖచ్చితంగా జగన్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు అని, కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, దీనిపై పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ జగన్ ఎక్కడ స్పందించలేదు. కోర్టు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని మాత్రమే ఆయన చెబుతున్నారు.
ఈ విషయంపై పార్టీలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో జగన్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కోర్టులు అనుమతి ఇచ్చాయి. కానీ, ఈసారి అనుమతి ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఈడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగితే జగన్ విదేశీ పర్యటనకు బ్రేక్ పడే అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates