రప్పా..రప్పా..నరుకుతా…పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. అయితే, అది రీల్ లైఫ్ కాబట్టి థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్ వేశారు. బహుశా తన కార్యకర్తలు కూడా అలా విజిల్స్ వేయాలని వైసీపీ అధినేత జగన్ భావించారో ఏమో తెలీదుగానీ…రప్పా రప్పా నరుకుతాం అంటూ అధికార పార్టీ నేతలుకు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ కార్యకర్తలను జగన్ ఖండించలేదు. పైగా, అదో సినిమా డైలాగ్..అది ఫ్లెక్సీల మీద వేస్తే తప్పేంటి అని సమర్థించుకున్నారు. ఆ తర్వాత వైసీపీకి రప్పా రప్పా బ్యాచ్ అని పేరు పడినా, వైసీపీ అరాచక ధోరణిని అధికార పక్షం ఎండగడుతున్నా సరే జగన్ మాత్రం తగ్గలేదు.
ఈ క్రమంలోనే వైసీపీ, జగన్ రప్పా రప్పా కామెంట్లపై మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు స్పందించారు. జగన్ రప్పా రప్పా అంటున్నారని, 2029లో రప్పా రప్పా అంటూ గెలుస్తామని అంటున్నారని ఏబీవీ మండిపడ్డారు. ఇక, జగన్ నైజం అరాచకం అని, జగన్ మార్క్ రాజకీయాలకు అదో చిహ్నం అని విమర్శించారు. జగన్ అరాచక రాజకీయాలకు అదో ఇండికేటర్ అని దుయ్యబట్టారు. అందుకే అది వద్దంటున్నానని, అటువంటి రాజకీయ పార్టీని ఏపీలో అధికారంలోకి రానివ్వకూడదనే తనలాంటి వాళ్లందరం కంకణం కట్టుకున్నామని చెప్పారు.
రాజకీయ నాయకులు రప్పా రప్పా అని నినాదాలు ఇవ్వడం సరైనదేనా అని ఏబీవీ ప్రశ్నించారు. మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కళ్లని వేట పోతులను నరికినట్లు నరుకుతాం అని వార్నింగ్ ఇస్తున్నారని, పరిపాలన అంటే ఏమైనా తమాషానా అంటూ మండిపడ్డారు. ఎక్కడ నరుకుతావు..ఎవరిని నరుకుతావయ్యా నువ్వు అంటూ జగన్ ను ప్రశ్నించారు.
జగన్ అలా చేస్తే పౌర సమాజం చూస్తూ ఊరుకోదని, ఎత్తి అవతల పడేస్తారని హెచ్చరించారు. నీలాంటి బోడిగాళ్లను నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఎంతోమందిని ప్రజలు ఎత్తిపడేశారని జగన్ ను ఉద్దేశించిన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తిరగబడితే దివాణాలు తగులబడిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. మరి, ఏబీవీ కామెంట్లు విని ఇకనైనా వైసీపీ, జగన్ రప్పా రప్పా అనడం మానేస్తారేమో వేచి చూడాలి!
Gulte Telugu Telugu Political and Movie News Updates